తప్పుదోవ పట్టిస్తున్న సోషల్‌ విూడియా మెసేజ్‌లు

సమాచారం తెలుసుకోకుండా షేర్‌ చేయొద్దన్న పోలీసులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
కామారెడ్డి,మే23( జ‌నం సాక్షి):  సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా షేర్‌ చేసి గందరగోళం సృష్టించవద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్‌ విూడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని కామారెడ్డి డీఎస్పీ  ప్రసన్నరాణి అన్నారు.  ఎక్కడో జరిగిన ఘటనలను మన ప్రాంతానికి అన్వయించడం తప్పన్నారు.  ప్రజలు భ యాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అనుమానితుల కదలికలపై సమాచారం ఇస్తే చ ర్యలు తీసుకుంటాం. సోషల్‌ విూడియాలో కొన్ని క్రిమినల్‌ చర్యలకు సంబంధించిన పోస్టులన్నీ అ బద్దాలే. అవన్నీ అసత్య ప్రచారాలని కొట్టి పారేశారు.  వారం రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు, మెసేజ్‌లు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఠాల సంచారం అంటూ వస్తున్న మెసేజ్‌లతో ప్రజలంతా ఆందోళనకు గురవ్వడమే కాకుండా అనుమానిత వ్యక్తులను పట్టుకుని చితకబాదే పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. ఎక్కడో జరిగిన ఘటనలను గ్రూపుల్లో పెట్టడంతో అది ఇక్కడే జరుగుతుందనుకునే భ్రమలో ప్రజలు మునిగి తేలుతున్నారు. ఆధునిక సమాజంలో సామాజిక మాధ్యమాలు పోషిస్తోన్న పాత్రతో ప్రజల్లో చైతన్యం విపరీతంగా పెరిగింది.
సమాచార మార్పిడి సైతం వేగం అందుకుంది. క్షణాల్లో సమాచారమంతా అరచేతిలో చేరి పోతోంది. ఇంతలా ప్రభావం చూపుతోన్న సోషల్‌ విూడియా ఇప్పుడు  దారి తప్పుతోంది. కొన్ని అసత్య ప్రచారాలతో మేలు కన్నా ఎక్కువ కీడే వెలుగు చూస్తోంది. ఇటీవల రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో పది మంది భవన నిర్మాణ కూలీలు సాయంత్రం బజారులో షికారు చేస్తున్నారు. అలా బయటకి వెళ్లిన వారంతా పొద్దు పోయాక చెరువు కట్టవిూద అందాలు వీక్షిస్తూ సెల్ఫీలు దిగడం మొదలు పెట్టారు. ఇంతలోనే వీరి భాష, వీరి వేషధారణ గమనించిన స్థానికులు కొందరు అనుమానంతో ప్రశ్నలు కురిపించారు. బీహార్‌కు చెందిన వారు కావడంతో తెలుగు రాకపోవడంతో దొంగలుగా భ్రమ పడిన చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వీరి వ్యవహారంపై విచారణ చేయగా చేయగా, వాస్తవాలు బయట పడ్డాయి. వీరు దొంగలు కాదని స్పష్టమైంది.  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు వచ్చిన కూలీలని తెలిసిన తర్వాత పోలీసులు వారిని వదిలి పెట్టడంతో కథ సుఖాంతమైంది.  దొంగతనాలపై అప్రమత్తత కోసం జిల్లా పోలీస్‌ యంత్రాంగం వాట్సాప్‌ వేదికగా ప్రజలను చైతన్యం చేసింది. కప్పా తాళాలు వేసుకోకుండా సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ను బిగించుకోవాలంటూ సూచనలు చేస్తోంది. ఇళ్లుకు తాళం వేసి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సీసీ కెమెరాలను ఏర్పర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇలా అధికారిక మెసేజ్‌లతో ప్రజల్లో ఓ రకమైన అవగాహన పెరుగుతున్న క్రమంలోనే అడ్డూ అదుపు లేకుండా వెల్లువెత్తుతోన్న అసత్య పోస్టులతో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అడ్డూ అదుపు లేని పోస్టులన్నీ అవాస్తవమని చెప్పలేక, ఖండించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాట్సాప్‌లో వచ్చే అనధికార మెసేజ్‌లను సులువుగా నమ్మవద్దని పోలీసులు సూచిస్తుండగా అనుమానితులపై పోలీసులకే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. దాడులకు దిగకూడదని సూచిస్తున్నారు.