తమిళనాడుకు పొంచివున్న మరో ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

బలపడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ

చెన్నై,నవంబర్‌20(జ‌నంసాక్షి): గజ తుపాను గండం నుంచి బయటపడక ముందే తమిళనాడుకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని గురించి చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్‌ బాలచంద్రన్‌ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ… బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతికి మారిందని, ఇది మరింత స్థిరపడనుందని తెలిపారు. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశముందన్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తదితర సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని సూచించారు. వచ్చే 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశమున్నందున జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. కడలూరు, నాగపట్నం, కారైక్కాల్‌, తిరువారూర్‌, తంజావూర్‌, పుదుకోట, రామనాథపురం జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల విస్తారంగా, వర్షం పడే అవకాశముందని చెప్పారు. చెన్నైలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వర్షం పడే అవకాశముందని పేర్కొన్నారు.