తానా సహకారం..మంత్రి ఔదార్యం.!

దివ్యాంగులకు, గ్రామీణ విద్యార్థినీలకు ధీమా.!
దివ్యాంగులకు ఫుల్ ఛార్జింగ్ తో 20 నుంచి 40కిమీ ప్రయాణ ప్రయోజనం.
బాధిత కుటుంబాల్లో వెలుగులు.. ఎవరిపై ఆధార పడకుండా సొంత పనులు చేసేందుకు మంత్రి అండ.
సిద్దిపేట బ్యూరో డిసెంబర్02( జనం సాక్షి )తానా సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, నారాయణరావుపేట మండల గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాల్లో చదివే విద్యార్థినీలకు సైకిళ్లు ను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు.దివ్యాంగులకు భగవంతుడు ఏదో ఒక విద్యలో నైపుణ్యత ఇచ్చి ఉంటాడని వాటిని కనుగొని వాటికనుగుణంగా జీవనం సాగించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. అమెరికా నుంచి వచ్చిన గొప్ప మనస్సున్న వారని తానా ప్రతినిధులను మంత్రి హరీశ్ రావు కొనియాడారు.
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా, వారి పనులు సొంతంగా చేసుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని., ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడి, క్షణక్షణం నరకయాతన పడుతున్న వారికి ఆసరాగా ఉంటున్నదని, బ్యాటరీతో నడి చే ట్రై సైకిళ్లను అందజేస్తున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట పట్టణం, ఇర్కోడ్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూరు, బెజ్జంకిలకు చెందిన 6 మంది దివ్యాంగులకు తానా సహకారంతో బ్యాటరీతో నడి చే ట్రై సైకిళ్లను, ల్యాప్ టాపులు, అలాగే మండల కేంద్రమైన నారాయణరావుపేట, జక్కాపూర్ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాల్లో చదివే విద్యార్థినీలకు సైకిళ్లు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
*విద్యార్థినీలకు సైకిళ్లు పంపిణీతో హర్షాతిరేకాలు.*
మంత్రి హరీశ్ రావు చొరవతో మండల కేంద్రమైన నారాయణరావుపేట, జక్కాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న చుట్టూ పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాల్లో చదివే 15 మంది విద్యార్థినీలకు సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల ఆయా పాఠశాల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినీలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తానా ప్రతినిధులు నిరంజన్, రవి, విశ్వనాథ్, సురేష్, శ్రీనివాస్, నాగేశ్వరరావు రావు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.