తానెప్పుడూ సిఎం పదవి ఆశించలేదు: శివకుమార్‌

బెంగళూరు,మే23( జ‌నం సాక్షి):  కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించినట్లు తానెప్పుడు చెప్పలేదన్నారు. జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో శివకుమార్‌ విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎవరూ అసంతృప్తితో లేరని స్పష్టంచేశారు. తామంతా కలిసే ఉన్నామని వివరించారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో తామంతా సంబరాల్లో ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని తాను ఆశించినట్లు ఎప్పుడూ చెప్పలేదని.. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు రసవత్తరంగా మారిన సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు భాజపా ప్రలోభాలకు గురికాకుండా చూడటమే కాకుండా.. అదృశ్యమైన ఇద్దరు ఎమ్మెల్యేలను తిరిగి సభకు హాజరుపరచడంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
———-