తిమ్మాపూర్‌లో కొత్తగా డెయిరీ ఏర్పాటు

పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు
కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పాడి పశు సంపదను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచడం, పెంచిన వాటిని కొనుగోలు చేసేందుకు గాను తిమ్మాపూర్‌లో కొత్తగా డెయిరీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్నందుకు ఉమ్మడి జిల్లా రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.  స్వయం ఉపాధితోపాటు వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా పాడి పశువులు పెంపుదల ఉపయోగపడుతుందన్నారు.మేలైన పాడి పశు సంపదను పెంచేందుకు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నదనీ, డిమాండ్‌కు తగిన విధంగా పాలు ఉత్పత్తి కావాలంటే పాడి పశువులను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే మన వాతావరణం తట్టుకోవడంతో పాటుగా దేశీయ ఆవుల పాలు రుచికరంగా, అనేక పోషకాలు ఉంటున్నాయన్న అభిప్రాయాలు ఇటీవల వ్యక్తమవుతున్నాయన్నారు.  అలాగే సాహివాల్‌ ఆవులు పెరగడానికి అనువైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, పాల దిగుబడి, ఈతల మధ్య కాల పరిమితి, వెన్న శాతం మిగతా వాటికంటే అధికంగా ఉంటుందని, అందుకే ఈ జాతి పశువులను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలనుంచి పెద్దల వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో పాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఈవిషయంపై ఎక్కుగా దృష్టిపెట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఎక్కువగా ఆడ దూడల సంతతి పెంపు, తద్వారా పాల ఉత్పత్తి వృద్ధిపై కేంద్రం దృష్టిసారించిందన్నారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా ఐదు పైలెట్‌ ప్రాజెక్టులను ఎంపిక చేసిందన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఆయా జిల్లాల్లో ఐదు గ్రామాలను ఎంపికచేసి దేశవాళీ పాడి పశువులను పరీక్షించి కృత్రిమ గర్భధారణ ద్వారా దేశవాళీ జాతులను అభివృద్ధి చేస్తారని తెలిపారు.