తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు

05-1420461354-kcr-600హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంగళవారం కేసీఆర్‌ తిరుమలకు వెళ్లనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి మార్గంలో తిరుపతి వరకు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ రోడ్డు పక్కన భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేరుతో ఈ పోస్టర్లు ఏర్పాటయ్యాయి.

సీఎం కేసీఆర్ తిరుమల షెడ్యూల్
ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ లేఖ ద్వారా ఏపీ డీజీపీ, టీటీడీ అధికారులకు తెలిపారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని లేఖలో ఆయన కోరారు. సీఎం కేసీఆర్ తో సహా ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, హరీశ్ రావు, ఐంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కవిత వెళ్లనున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలు…
21వ తేదీ మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయంకు బయలుదేరుతారు.
3:55 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరుతారు.
సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.
5:05 గంటలకు రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరుతారు.
సాయంత్రం 6:30 గంటలకు తిరుమల గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
22-02-2017 రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కానుకలు సమర్పిస్తారు.
అనంతరం పుష్పగిరి మఠంలో టీఆర్‌ఎస్ నాయకుడు, పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు.
ఉదయం 10:30 గంటలకు అతిథి గృహానికి చేరుకుంటారు.
11:30 గంటలకు తిరుపతిలోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. 11:50 గంటలకు దేవాలయం నుంచి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరుతారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు.
1:45 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.
శ్రీవారికి తెలంగాణ కానుకలు
రూ. 5.59కోట్ల విలువైన సాలగ్రామహారం, కంఠాభరణాలను స్వామివారికి కానుకగా ఇవ్వనున్నారు. అదే రోజు తిరుపతిలోని పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను కూడా సమర్పించుకుంటారు. 22వ తేదీ సాయంత్రం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి తిరుమల, తిరుపతి పర్యటన నేపథ్యంలో గతంలో టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి సోమవారమే తిరుమలకు పయనమవుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ కూడా వెళ్లి, ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంలో రాష్ట్ర సాధనకు ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడని సీఎం తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న విధంగానే ఒక్కొక్క వేల్పుకు మొక్కులు చెల్లిస్తున్నారు.

ఈ క్రమంలోనే భద్రకాళి అమ్మవారికి కిరీటం, ఖడ్గం సమర్పించారు. కురివి మల్లన్నకు మీసాలు సమర్పించుకున్నారు. అదేవరుసలో తిరుమల వేంకటేశ్వరస్వామి మొక్కు చెల్లించనున్నారు. రూ.5.59 కోట్ల వ్యయంతో స్వామివారికి సాలగ్రామహారం, కంఠహారం వంటి ఆభరణాలను చేయించారు. వీటి నిర్మాణ బాధ్యతను కూడా టీటీడీ అధికారులకే అప్పగించారు. ఈ వరుసలోనే తిరుచానూర్ పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక మొక్కు చెల్లించనున్నారు.