తిరుమలపై నిజాలు నిగ్గు తేల్చాలి

చంద్రబాబు తన నీడను చూసుకుని తానే భయపడే స్థితికి వచ్చారు. సమస్య ఏదైనా, తన ప్రభుత్వం చేయగలిగిన స్థితితో ఉన్నా కేంద్రం బూచి చూపి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటికీ కేంద్రమే కారణమన్న రీతిలో విమర్వలకు పదును పెడుతున్నారు. మరీ ఇంతదారుణంగా వెలితే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవడం లేదు. నిజానికి తిరుమల పవిత్రతపై ఎన్నో ఏళ్లుగా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అక్కడ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పుట్టా సుధాకర్‌ లాంటి వారిని టిటిడి బోర్డు ఛ;ఐర్మన్‌గా నియమించడంపై విమర్వలు చెలరేగాయి. రాజకీయ అవసరాలకు తిరుమలను వాడుకోవడంపై శరపరంపరగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రధానార్చకులుగా ఉద్వాసనకు గురైన రమణదీక్షితులు చేసిన ఆరోపణలు ఆజ్యం పోశాయి. వీటిపై చర్చించి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాల్సింది పోయి, కేంద్రం కుట్ర చేస్తోందని అని చెప్పడం ద్వారా బాబు తన అసమర్థతను బయటపెట్టుకుంటున్నారు. తిరుమలలో ఏదైనా అక్రమాలు, అపచారం జరిగితే విచారణ చేయించి చర్యలు తీసుకునే బదులు ఇలాంటి ఎదురుదాడి వ్యవహారాలతో అసలు విషయాలను మరుగున పర్చడం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచన చేయడం లేదు. దీనికి కేంద్రం రంగు పులిమినంత మాత్రాన ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లు కాదు.తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల కేంద్రం కుట్ర చేసిందని చంద్రబాబు ఆరోపించారు. పరిరక్షించాల్సిన ఆలయం పేరుతో దానికి భారత పురావస్తు విభాగానికి స్వాధీనం చేయాలంటూ నోటీసు పంపించారని, దానిని తిప్పికొడితే.. కింది స్థాయి అధికారిణిని బదిలీ చేశారన్నారు. దానిని స్వాధీనం చేసుకునే హక్కు కేంద్రానికి లేదన్నారు. ఇలాంటి కుట్రలు భవిష్యత్‌లో ఇంకా చాలా ఉంటాయని, అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపిచ్చారు. ఇలాంటివన్నీ చూశాకే కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చామన్నారు.   టిటిడిలో అక్రమాలు జరుగుతున్నాయని, ఆభరణాలు, గల్లంతయ్యాయని, మాజీ ప్రధాన అర్చకులు పత్రికాముఖంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజకీయ పక్షాలు కూడా కోరుతున్నాయి.  కొన్ని రాజకీయపార్టీలు ప్రజలను రెచ్చగొట్టేందుకు దీన్ని వివాదాస్పదం చేస్తున్నాయన్న విమర్శలొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాల్సి ఉందని కోరారు. టిటిడి వ్వవహారంపై సాధారణ ప్రజలు, భక్తులు, ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని వాస్తవాలూ వెల్లడించాలని  డిమాండ్‌ చేశారు. అయితే  తిరుపతి శ్రీవేంకటేశ్వరుడితో పెట్టుకోవద్దని…అపరాధం చేసిన వారి నుంచి వడ్డీతో సహా అన్నీ వసూలు చేస్తాడని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రం పన్నిన కుట్రలో తిరుమలను కూడా లాగారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం టీటీడీలో ఏం జరుగుతోందో అందరూ చూస్తున్నారన్నారు. ‘వేంకటేశ్వరస్వామిని నమ్ముతా.. ఆయన ఆశీస్సులు నాకు ఉన్నాయి…నా హత్యకు 24 క్లెమోర్‌మైన్స్‌తో కుట్ర పన్నారు. ఆ ఆపద నుంచి వెంకన్న స్వామే నన్ను కాపాడారు. నాతో ఏదో పని చేయించాలని నన్ను కాపాడారు…అదే నవ్యాంధప్రదేశ్‌ అభివృద్ధి’ అని పేర్కొన్నారు. ఎవరూ వెంకన్నతో పెట్టుకోవద్దని, వడ్డీతో సహా వసూలు చేస్తారన్నారు.  స్వామి వారి గులాబీ రంగు వజ్రం పోయిందని ఇప్పుడు ప్రచారం చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ ఘటన అప్పుడెప్పుడో జరిగిందని, దీనిపై 2009 నుంచి 2011లో జగన్నాథం, వాధ్వా కమిటీలతో విచారణ చేయించారన్నారు. అప్పట్లో పోయింది వజ్రం కాదని కెంపు అని కమిటీలే తేల్చాయని, అదే విషయం అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక పంపారని చంద్రబాబు గుర్తుచేశారు. 
‘గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని మరో వివాదం తెరపైకి తెచ్చారు. తిరుమల కొండపై పోటు ఉండే ప్రాంతంలో వంట చేస్తారు. ఆ ప్రాంతాన్ని వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత పర్యవేక్షిస్తుంటుందని ప్రతీతి. సంప్రదాయాలు పాటించే దేవాలయంగా తిరుమలకు ఎంతో పేరుంది. దేశంలో మరెక్కడా ఇంత పవిత్రంగా, సంప్రదాయంగా ఉండే దేవాలయం లేదు. వారణాసితో పాటు అనేకచోట్ల ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. తిరుమలలో పవిత్రత కాపాడడం, చక్కని పాలన అందించడం నందమూరి తారకరామారావు నుంచి ప్రారంభమయ్యాయి. దానిని నేను కాపాడుతూ వస్తున్నాను’ అని తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగానే.. తనను అప్రతిష్ఠ పాల్జేయడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. దీనిలో భాగంగానే ప్రధాన అర్చకుడిని ఢిల్లీ పిలిపించుకుని తప్పుడు సమాచారం చెప్పించారని ఆరోపించారు. ప్రధాన అర్చకుడి ఇంట్లో వైఎస్‌ ఫొటో ఉందని.. దీనిని బట్టే ఆయన ఎలాంటి స్వామో తెలుస్తోందని చెప్పారు. తిరుమలలో ఎప్పుడో జరిగిన దాని గురించి పదేపదే చెబుతూ రెచ్చగొడుతూ విశ్వసనీయతను దెబ్బతీయవద్దని కోరారు. అయితే ఆరోపణలు ఎలాంటివైనా వాటిపైన విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చి సమాధానం ఇవ్వాలి. అంతేగానీ ఎదురుదాడితో సమస్య మరింత రాజుకోవడం తప్పదని తెలుసుకోవాలి. ఒకవేళ రమణదీక్షితుల ఆరోపణలు తప్పయితే ఆయనను నిలదీయాలి. కేంద్రం హస్తం నిజంగానే ఉంటే ఎండగట్టాలి. అంతేగాని తిరుమల వ్యవహారాలను చూసీచూడనట్లుగా ఉండరాదు. అది మంచిది కాదు. స్వామికి ఎవరైనా అపచారం తలపెడితే ఈ జీవితంలోనే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ నమ్మకంతో ముందుకు సాగాలి. తిరుమల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు వెళ్లాలి.