తిరుమలలో మరోభారీ చోరీ

– రూ.3లక్షల విలువైన బంగారం, నగదు అపహరణ
– కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్న పోలీసులు
తిరుమల, జులై23(జ‌నంసాక్షి) : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో దొంగలు రెచ్చిపోతున్నారు. మరోసారి కాటేజీల్లో దొంగలు పడ్డారు. కొన్ని రోజుల క్రితం అతిథిగృహంలో దొంగతనం జరిగిన ఘటన మరువకముందే మరో చోరీ జరిగింది. ఈసారి సన్నిధానం అతిథిగృహంలో దొంగతనం జరిగింది. తాళాలు పగలకొట్టి రూమ్‌ నెంబర్‌ 47లోకి చొరబడిన దొంగలు.. రూ.3లక్షలు విలువైన బంగారు నగలు, రూ.20వేలు నగదు అపహరించుకుపోయారు. బాధితులు విజయవాడకు చెందిన భక్తులు. దీనిపై వారు పోలీసులకు
ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. డాగ్‌ స్వ్కాడ్‌ తో ఘటనా స్థలానికి వచ్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
అతిథి గృహంలో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతిథి గృహంలో పని చేసిన సిబ్బందే చోరీకి పాల్పడ్డారా లేక వీళ్లకు సంబంధించిన వేరేవాళ్లు ఎవరైనా చోరీ చేశారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా నిందితులను అరెస్ట్‌ చేసి దొంగలించిన సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు. తిరుమలలో నిత్యం ఫుల్‌ సెక్యూరిటీ ఉంటుంది. కాటేజీల దగ్గర ప్రత్యేక భద్రత ఉంటుంది. నిత్యం భక్తులు తిరుగుతుంటారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇంత సెక్యూరిటీ ఉన్నా దొంగతనాలు జరుగుతుండటం భక్తుల్లో ఆందోళన నింపింది. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో చోరీ ఘటనలు జరిగాయి. వరుస దొంగతనాలు భక్తులను కలవరానికి గురి చేస్తున్నాయి. పోలీసులు భద్రత పెంచాలని, ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.