తిరుమల శ్రీవారిని  దర్శించుకున్న మంత్రి పువ్వాడ

– కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం
– రవాణాశాఖలో నూతన మార్పులు తీసుకొస్తాం
– మంత్రి అజయ్‌కుమార్‌ వెల్లడి
చిత్తూరు, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  తిరుమల శ్రీవారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం భార్య, కుమారుడితో కలిసి వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో రెండోవ సారి శాసన సభ్యుడిగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాపై నమ్మకంతో తెలంగాణాలో రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు రుణపడి ఉంటానన్నారు. ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖలో నూతన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ సలహాలు సూచనలతో రాష్ట్రంలో రవాణాశాఖను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగిలిన రాష్టాల్రకు ఆదర్శంగా నిలవనుందని అన్నారు.