తీర్పు అమలుకు సమయం కావాలి

సుప్రీంకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వినతి

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు మరింత సమయం కావాలంటూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రాథమిక సౌకర్యాల లేమి, ఇతరత్రా కారణాలతో తీర్పులు అమల్లోకి తీసుకురావడం ఇప్పుడే సాధ్యం కాదని, తమకు కొంత సమయం ఇవ్వాలని బోర్డు న్యాయస్థానాన్ని కోరింది. ఈ ఏడాది ఆగస్టులో కేరళలో సంభవించిన వరదల కారణంగా పంబ, నీలక్కల్‌ ప్రాంతాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల్లో సదుపాయాలు సరిగ్గా లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక.. మహిళా భక్తులకు వాష్‌రూం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమకు కొంత సమయం కావాలని బోర్డు కోర్టును కోరింది. ఇక తాజాగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మహిళల ప్రవేశానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉందని బోర్డు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పును ఇప్పుడే అమలు చేయలేమని బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. శబరిమలలో 10 నుంచి 50ఏళ్ల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్వ్యూ పిటిషన్లను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. వచ్చే ఏడాది జనవరిలో వీటిని విచారిస్తామని పేర్కొంది. అయితే గతంలో ఇచ్చిన తీర్పుపై మాత్రం ఎలాంటి స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ బోర్డు కోర్టును ఆశ్రయించింది.

ఇదిలా ఉండగా.. మండల పూజ నిమిత్తం శబరిమల ఆలయం ఇటీవల తెరుచుకుంది. గతంలో జరిగిన ఆందోళనల దృష్ట్యా ఈసారి శబరిమలలో పకడ్బందీ ఏర్పాటు చేశారు. భారీగా మోహరించారు. ఆలయ ప్రాంగణంలో 144 సెక్షన్‌ విధించారు. అయితే ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఆదివారం అర్ధరాత్రి అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. దీంతో శబరిమలలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.