తుంగభద్రకు రికార్డు స్థాయిలో వరద

– జలాశయంలోకి 2.10లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిక
– దశాబ్దంన్నర తరువాత 33 గేట్లను ఎత్తిన అధికారులు
బళ్లారి, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : తుంగభద్ర జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. గడిచిన దశాబ్దం కాలంలో ఎప్పుడూ లేనంతగా 2,10లక్షల క్యూసెక్కుల వరద నీరు తుంగభద్ర జలాశయంలోకి చేరుతోంది. భారీగా వస్తున్న వరదతో జలాశయానికి ప్రమాదం లేకుండా రెండు అడుగల మేర నీటి మట్టం తక్కువగా నిర్వహిస్తూ 33 గేట్ల ద్వారా 2.30లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న ఆంధప్రదేశ్‌ వైపు విడుదల చేస్తున్నారు. మరోవైపు హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కర్ణాటక కాలువల ద్వారా 11వేల క్యూసెక్కుల నీరు నిరంతరాయంగా వెళుతోంది. అనంతపురం జిల్లాకు వైపు ప్రవహించే హెచ్చెల్సీ కాలువకు తొలిసారిగా 2100 క్యూసెక్కుల నీరు వెళుతోంది. కర్ణాటక రాష్ట్రంలో 105 కిలోవిూటరు వరకు హెచ్చెల్సీ కాలువకు లైనింగ్‌ పనులు పూర్తి చేయడంతో తొలిసారిగా ఈ కాలువ నుంచి 4100 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. హెచ్చెల్సీ కోటా మేరకు అనంత రైతులకు ఆంధ్రా సరిహద్దు వద్ద కాలువలో నీటి మట్టం కనిపిస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి మరో మూడు రోజులు భారీ వరద కొనసాగే అవకాశం ఉన్నందున డ్యాం గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల కొనసాగనుందని టీబీ డ్యాం అధికారులు చెబుతున్నారు. దశాబ్దంన్నర తరువాత టీబీ డ్యాం వద్ద 33 గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తుండటంతో కనువిందైన ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. దీన్ని తిలకించేందుకు మూడు రాష్ట్రాలకు చెందిన సందర్శకులు పెద్దఎత్తున వస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో అటు బెంగుళూరు నగరంతో పాటు పలు చోట్ల నుంచి సందర్శకుల తాకిడి పెరగనుంది