తెరాస విజయవిహారం

C
– రికార్డు బద్ధలు కొట్టిన దయాకర్‌

– 4.59 లక్షల మెజారిటీ

– డిపాజిట్లు గల్లంతైన కాంగ్రెస్‌, భాజపా

– వరంగల్‌లో పసునూరి అపూర్వ విజయం

వరంగల్‌,నవంబర్‌ 24 (జనంసాక్షి):ఓరుగల్లు తెరాసాకు విజయ విహరవ అందించింది. గెలుపు ఇంత భారీగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పోలింగ్‌ శాతం తగ్గడంతో టిఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని అంచనాలు వేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు ఓటేయడానికి రాలేదని విపక్షాలు ప్రచారం చేశాయి. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ ఘన విజయం సాధించారు. ఓటమి ఇంత దారుణంగా ఉంటుందని విపక్షాలు కూడా ఊహించివుండలేదు. ఎంత దారుణంగా అంటే వారి డిపాజిట్లు దక్కనంతగా ఓటమి ఉండడం వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితంగా చెప్పుకోవాలి. ఇక దిగుమతి చేసుకున్న అభ్యర్థులు అంటూ టిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. చివరి నిముషం అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దిగిన సర్వే సత్యనారాయణ, ఎన్‌ఆర్‌ఐగా ప్రజలకు పరిచయం లేని అభ్యర్థి దేవయ్యను బిజెపి నిలబెట్టినా ప్రజలు ఆమోదించలేదు. స్థానికుడైన నిఖార్సయిన టిఆర్‌ఎస్‌ కార్యకర్త మసునూరి దయాకర్‌నే ఓటర్లు ఆదరించారు. అలాఇలా కాకుండా భారీ మెజార్టీ అందించి విపక్షాలకు కోలుకోలేనంతగా దెబ్బకొట్టారు. గతంలోని సీఎం కేసీఆర్‌, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డును బద్దలు కొడుతూ పసునూరి దయాకర్‌ బ్రేక్‌ చేశారు. 4,59,092 ఓట్ల భారీ మెజార్టీతో పసునూరి గెలుపొందారు. ఉప ఎన్నికలో పసునూరి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఇవిఎంలు ఓపెన్‌ చేయగానే మొదలైన ఆధిక్యత ఎక్కడా తగ్గకుండా విపక్షాల బిపి పెరిగేలా టిఆర్‌ఎస్‌ ఆధిక్యం పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడా ఆగలేదు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలిస్తే.. ప్రతిపక్షాలు బంగాళాఖాతంలో కలిసిపోయాయి. తొలి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకు అన్ని సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్సే అత్యధిక మెజార్టీతో దూసుకుపోయింది. టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చి , స్వీట్లు పంచుకున్నారు.వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం మొదలయ్యింది. తొలినుంచి తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్‌ ప్రత్యర్థులకు అందనంత భారీ అధిక్యంలో దూసుకుపోయారు. తొలి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్‌ ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు.  మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆధిక్యం మాత్రం తగ్గకుండా దూసుకుని పోయారు.  వరంగల్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేసారు. ఓట్ల లెక్కింపు పక్రియను జిల్లా కలెక్టర్‌ కరుణ, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పర్యవేక్షించారు. మొత్తంగా వరంగల్‌ ఉప ఎన్నికలో ‘కారు’ జోరు కొనసాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ సుమారు నాలుగున్నర లక్షలకు పైగా ఆధిక్యంలో అంచనాలకు మించి దూసుకుపోవడంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. టీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో ఉంది. వరంగల్‌ ఉపఎన్నికలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం నాలుగు ప్రధాన పార్టీల మధ్యే సాగింది. అధికార టీఆర్‌ఎస్‌ ఏరికోరి తెలంగాణవాది పసునూరి దయాకర్‌ను నిలబెట్టింది.  అనుహ్య పరిణామాల మధ్య సిరిసిల్ల రాజయ్య స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బరిలోకి దిగారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌, బీజేపీ నుంచి  పగిడిపాటి దేవయ్య  పోటీ చేశారు. ప్రతి రౌండ్‌ లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి 62 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు పార్టీ హవా ఇలాగే కొనసాగితే  మెజారిటీ గతంలో కన్నా పెరుగుతందని  విశ్లేషకులు ముందే అంచనా వేసారు. వరంగల్‌ ఉప ఎన్నికలో కౌంటింగ్‌ ట్రెండ్‌ చూస్తుంటే ప్రత్యర్ది పార్టీలలో ఒక్కదానికైనా డిపాజిట్‌ వస్తుందా?రాదా అన్న సందేహం వ్యక్తం చేసినట్లుగానే వరాఇకి డిపాజిట్లు దక్కకుండా పోయాయి.వరంగల్‌ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ గెలుపుతో తెరాస శ్రేణులు ఎనుమాముల మార్కెట్‌ ఎదుట సంబరాలు చేసుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. బాణసంచా, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.  దయాకర్‌ గెలుపు దాదాపు స్పష్టం కావడంతో తెరాస శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్బంగా వరంగల్‌ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మరింత సమర్థంగా పనిచేసేందుకు వరంగల్‌ ప్రజలు స్ఫూర్తినిచ్చారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వరంగల్‌ ఓటర్లకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.  వరంగల్‌వాసులు మాకెంతో ప్రేరణ ఇచ్చారు. ఈ ప్రేరణతో మరింత వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ప్రచార బాధ్యతలను మంత్రి కేటీఆర్‌ నిర్వర్తించిన విషయం తెలిసిందే.