తెలంగాణకు ప్రతిష్టాత్మక ఇండియాటుడే అవార్డు

మంత్రి పోచారంను అభినందించిన మంత్రులు కడియం,కెటిఆర్‌లు

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దడంలో ముందున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రలుఉ కడియం శ్రీహరి, కెటి రామారావులు అభినందించారు. తెలంగాణ వ్యవసాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కేటగిరీలో ఇండియాటుడే అవార్డు సాధించడం పట్ల ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి,కెటిఆర్‌లు పోచారానికి అభినందనలు తెలిపారు. వ్యవసాయాన్ని ఆదర్శంగా మారుస్తూ పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం నెరవేరుతుందని ఇండియాటుడే అవార్డుతో అది నిరూపణ అయిందన్నారు. ఈ అవార్డు సాధించడం కోసం కృషి చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు కూడా అభినందనలు తెలిపారు.రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా గుర్తిస్తూ ఇండియా టుడే సంస్థ తెలంగాణకు ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన బృందానికి మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ ఈ అవార్డును అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు రావాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఇండియా టుడే గ్రూప్‌ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. వ్యవసాయశాఖకు ప్రతిష్ఠాత్మకమైన అవార్డు రావడం ఎంతో సం తోషకరమైన విషయమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగేండ్లలో వ్యవసాయం, రైతుల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న పథకాలు గత 70 ఏండ్లలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టలేదని చెప్పారు. వ్యవసాయరంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందనడానికి ఈ అవార్డు ఒక నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ వేస్తున్న ప్రతి అడుగు రైతుల మేలు కోసమేనని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.8వేలు, లక్షాయాభై వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, రైతుకు రూ. 5 లక్షల బీమా, భారీసబ్సిడీతో యంత్ర పరికరాల పంపిణీ, 5వేల ఎకరాలకు వ్యవసాయ విస్తరణాధికారి వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నదని తెలిపారు.