తెలంగాణపై ఇంకా.. చంద్రబాబు పెత్తనమేంటి?


– మళ్లీ మన బతుకులను ఆగం చేసుకోవద్దు
– చంద్రబాబుకు ఓటుతో బుద్దిచెప్పండి
– అభివృద్ధి చేసేదెవరో ఆలోచించండి..
– భాజపా, కాంగ్రెస్‌లు రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి
– ఫ్యూడల్‌ పాలన పోవాలంటే.. ఫెడరల్‌ ఫ్రెంట్‌ రావాలి
– ఎన్నికల తర్వాత దేశమంతా తిరుగుతా
– రాష్ట్రాలన్నింటిని ఏకంచేస్తా
– రాష్ట్రంలో కోటిఎకరాలకు నీరందించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం
– నారాయణఖేడ్‌ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌
మెదక్‌, నవంబర్‌28(జనంసాక్షి) : మన ఇలాకాలోకే వచ్చి మన ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని, చంద్రబాబుకు తెలంగాణపై ఇంకా పెత్తనంమేంటని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెసోళ్లు 60ఏళ్లకుపైగా పాలించి తెలంగాణను అదోగతిపాలు చేశారని, తెలంగాణ తెచ్చుకొని మన బాగు చేసుకుంటున్నామని అన్నారు. మళ్లీ మళ్లీ ఇంట్లోకి వచ్చి విూ ప్రాజెక్టులను అడ్డుకుంటా అంటున్న చంద్రబాబును ఓటుతో తరిమొకొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. నారాయణ్‌ఖేడ్‌లో భూపాల్‌ రెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి జరిగిందన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో భూపాల్‌రెడ్డికి 68 శాతం ప్రజల మద్దతు ఉందని నివేదికలు చెబుతున్నాయని,  భూపాల్‌రెడ్డి మంచి మెజార్టీతో గెలవాలని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ ఎట్లా ఉండేదో.. ఇప్పుడు ఎట్లుందో విూకు తెలుసునని, పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి అధికారమొస్తే కరెంట్‌ ఉండదని, మళ్లీ కథ మొదటికి వస్తదని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత ప్రాంతాల్లో 1000రూపాయలు పెన్షన్‌ ఇస్తున్నారా..? కనివినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్‌ ఎక్కడైనా ఉందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పెట్టుబడులు వస్తున్నాయని, గతంలో విద్యుత్‌ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, రైతుబంధు కింద మెదక్‌ జిల్లాలో అత్యధికంగా లబ్ధి పొందిన ప్రాంతం నారాయణ్‌ఖేడ్‌ ఉందన్నారు. రైతు బీమా కింద ఇప్పటికవరకు 3900 మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కోటిఎకరాలకు సాగునీరు అందించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నమన్నారు. రాహుల్‌గాంధీ, మోదీ అడ్డం నిలువు మాట్లాడుతున్నానరని విమర్శిచారు. చంద్రబాబు నాయుడు మన ఇంటికొచ్చి మనల్నే కొట్టిపోతానంటున్నాడని, తెలంగాణపై ఇంకా చంద్రబాబు పెత్తనం అవసరమా..? అని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడును చేతితో కొట్టకుండా.. ఓటుతో కొట్టి చూపించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ లేని ఫెడరర్‌ ఫ్రంట్‌ రావాలని, ఎన్నికల తర్వాత దేశమంతా తిరుగుతానని, రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకే రావాలన్నారు. నారాయణ్‌ ఖేడ్‌ వాసులు మంజీరా బేసిన్‌లో ఉన్నారని,  విూకు లక్ష ఎకరాలకు సాగునీరు రావాలని, సింగూరు నుంచి రెండు లిఫ్ట్‌లు పెట్టాలని, కాళేశ్వరం నీళ్లతో
సింగూరును నింపాలన్నారు. నారాయణ్‌ఖేడ్‌కు లక్ష ఎకరాలకు సాగునీరందించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
ఎంఐఎం-తెరాస మిత్ర పక్షాలం
హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్‌ కచ్చితంగా గెలుస్తాడని, మేం మిత్రపక్షాలంఅని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 16ఎంపీ సీట్లు తెరాస గెలవాని,  దేశంలో అనేక పార్టీలు మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ పార్టీల నేతలతో నేను మాట్లాడానని, ఢిల్లీపై కాంగ్రెస్‌ వాసన, భాజపా వాసన లేని ప్రభుత్వ జెండాను పాతాలన్నారు. రాష్ట్రాలకు అధికారాలు రావాలని, విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా.. అన్నింటిపైనా కేంద్రానిదే పెత్తనం చేస్తున్నాయని, అధికారం బదలాయించమంటే బదలాయించరని,  కేంద్రం అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటోందని కేసీఆర్‌ మండిపడ్డారు.