తెలంగాణమంత్రుల రాజకీయ ప్రస్థానం.. 

హైదరాబాద్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : మంగళవారం మంత్రులుగా రాజ్‌భవన్‌లో పదిమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగావీరిలో గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వారు నలుగురు ఉండగా, మిగిలిన ఆరుగురు కొత్తవారు కావటం విశేషం.
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
పేరు: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
పుట్టినతేది: 16.02.1949
విద్యార్హత: బీకాం ఎల్‌ఎల్‌బీ
స్వస్థలం: నిర్మల్‌ మండలం ఎల్లపెల్లి
కుటుంబం: భార్య విజయలక్ష్మి గృహిణి, కుమారుడు గౌతంరెడ్డి, కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవిరెడ్డి, అల్లుడు రంజిత్‌రెడ్డి
రాజకీయ ప్రస్థాపనం :-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రెండవ సారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయంలో ఎన్నో పదవులు అలంకరించారు. 1969లో విద్యార్థిదశలో కళాశాలల్లో జరిగిన ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ తరువాత కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. తెదేపా ఆవిర్భావం తరువాత పార్టీ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. తెదేపా పార్టీ నుంచి 1987లో జడ్పీఛైర్మన్‌గా 1991లో ఎంపీగా గెలుపొందారు ఆ సమయంలో ఇంద్రకరణ్‌రెడ్డి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు తెదేపాను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. క్రమేణా జిల్లా రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 1999, 2004లో జరిగిన నిర్మల్‌ శాసనసభ స్థానం నుంచి గెలుపొందారు. 2001లో టీసీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌గా పనిచేశారు. 2008లో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 2009లో నిర్మల్‌ శాసనసభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో సిర్పూర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. తరువాత కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వైకాపా వ్యతిరేకించడంతో ఆ పార్టీకీ రాజీనామా చేశారు. అనంతరం 2014లో నిర్మల్‌ శాసనసభ స్థానానికి బహుజన సమాజ్‌ పార్టీ (బసపా) నుంచి పోటీచేసి అనూహ్యంగా గెలుపొంది అందరి అంచనాలు తలకిందులు చేశారు. తర్వాత తెరాసలో చేరారు. 2014 డిసెంబరు 16న రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో నిర్మల్‌ శాసనసభ స్థానానికి తెరాస పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మంగళవారం రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
——————————————–
ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌
తల్లిదండ్రులు – శాంతమ్మ -నారాయణగౌడ్‌
స్వస్థలం – రాచాల (అడ్డాకుల)
పుట్టిన తేదీ – 1969 మార్చి16
భార్య – శారద
కుమార్తెలు – శ్రీహిత, శ్రీహర్షిత
విద్యార్హత – బీఎస్సీ, ఎంసీజే
ఉద్యోగ అనుభవం – మున్సిపల్‌ శాఖలో కమిషనర్‌
ఇతరాలు – జేఏసీ కో-చైర్మన్‌, టీజీవోస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు
రాజకీయ అనుభవం – 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా, 2019 రెండవ సారి గెలుపు.
ఉద్యోగసంఘ నేత నుంచి..
మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతోపాటు బలమైన సామాజికవర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. మున్సిపల్‌ శాఖలో కమిషనర్‌ స్థాయిలో ఉద్యోగం చేసిన ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అండదండగా నిలిచాడు. ఉద్యోగ సంఘాల నుంచి నాయకత్వం వహించి తెలంగాణ  ఉద్యమంలో కీలకంగా మారాడు. సలకల జనుల సమ్మెతో పాటు ఉద్యోగులు చేపట్టిన ప్రతీ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2014 ప్రత్యేక తెలంగాణ అనంతరం తెరాసలో చేరారు. దీంతో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ  స్థానాన్ని  శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించారు. దీంతో 2014గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు. మరోసారి 2019లో అదే స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో ఉద్యమ నేతగా, ఉద్యోగ సంఘాల నాయకుడిగా అనుభవం ఉండటంతో శ్రీనివాస్‌గౌడ్‌కు కేసీఆర్‌ మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.
———————————-
కేసీఆర్‌కు సన్నిహితుడిగా నిరంజన్‌రెడ్డి
తల్లిదండ్రులు – తారకమ్మ – రాంరెడ్డి
స్వస్థలం – పాన్‌గల్‌
పుట్టిన తేదీ – 1958 అక్టోబర్‌ 04
భార్య – వాసంతి
కుమార్తెలు – ప్రత్యూష, అమృత వర్షిణి, తేజస్విని
విద్యార్హత – బీఎస్పీ, ఎల్‌ఎల్‌బీ (క్రిమినల్‌ న్యాయవాదిగా కొన్నాళ్లు పనిచేశారు)
రాజకీయ ప్రస్థావన :- వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్‌రెడ్డి శాసనసభలో కాలుపెట్టడం మొదటిసారి. కేసీఆర్‌కు సన్నిహితుడిగా నిరంజన్‌రెడ్డికి పేరుంది. 2014లో ఓటమి పాలైనప్పటికీ కేబినెట్‌ ర్యాంకు ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నుంచి రెండోసారి పోటీ చేసి విజయంసాధించాడు. దీంతో మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. నిరంజన్‌రెడ్డి టీడీపీలో పార్టీ విశ్లేషకులుగా వ్యవహరించారు. 2001లో వ్యవస్థాపక సభ్యులుగా టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్‌ వెంట తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అంతకు ముందు టీడీపీ హయాంలో 1999 నుంచి 2000 వరకు ఖాదీబోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి 2014వరకు టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, 2014 డిసెంబర్‌ నుంచి 2018 నవంబర్‌ 12వరకు రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.
—————————————-
ఎర్రబెల్లి దయాకర్‌రావు..
పూర్తి పేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
తండ్రి : ఎర్రబెల్లి జగన్నాథరావు
తల్లి : ఎర్రబెల్లి ఆదిలక్ష్మి
భా/ూర్య : ఉషాదయాకర్‌రావు
కుమారులు: ఎర్రబెల్లి ప్రేమ్‌ చందర్‌రావు
స్వగ్రామం: గ్రామం, మండలం, పర్వతగిరి, జిల్లా వరంగల్‌ రూరల్‌
పుట్టిన తేది: 04-07-1956
విద్యార్హతలు: ఇంటర్మీడియట్‌
రాజకీయ ప్రస్థానం :- వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 1982లో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఆ తరువాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలతోపాటు 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా వరుసగా ఆరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత టీడీఎల్పీ నేతగా వ్యహరించారు. 2016లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 53,062 ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించారు. తెదేపా లో ఎన్టీఆర్‌ హయాం నుండి రాజకీయాల్లో ఉన్నప్పటికీ మంత్రిగా అవకాశం రాలేదు. ఎన్టీఆర్‌ హయాంలో, చంద్రబాబు హయాంలో మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినా అవకాశం దక్కలేదు. కాగా కేసీఆర్‌ హయాంలో ప్రస్తుతం మంత్రిగా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు.
———————————————-
మరోసారి మంత్రిగా జగదీశ్వర్‌రెడ్డి
పేరు: గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
తండ్రి   :  చంద్రారెడ్డి
తల్లి    : సావిత్రమ్మ
భార్య    : సునీత
కుమారుడు    : వేమన్‌రెడ్డి
కూతురు    : లహరి
పుట్టినతేదీ    : 18.07.1965
స్వగ్రామం    : నాగారం (నాగారం మండలం)
విద్యార్హత    : బీఏ, బీఎల్‌
రాజకీయ ప్రస్థానం :- సుధీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తిగా జగదీశ్వర్‌రెడ్డికి పేరుంది. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ్యులుగా చేరారు. 2001 సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్‌చార్జిగా, 2002 మహబూబ్‌నగర్‌ పాదయాత్ర ఇన్‌చార్జి (జల సాధన 45 రోజుల కార్యక్రమం. పాదయాత్ర ఆలంపూర్‌ నుంచి ఆర్డీఎస్‌ వరకు..), 2003 మెదక్‌ ఉప ఎన్నికల ఇన్‌చార్జిగా, 2004 సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్‌చార్జి (హరీష్‌రావు ఎన్నిక), 2005 సదాశివపేట మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి, 2006 కరీంనగర్‌ ఎంపీ
ఉప ఎన్నికల ఇన్‌చార్జి, 2008 ముషీరాబాద్‌, ఆలేరు ఉప ఎన్నికల ఇన్‌చార్జి, మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి, 2009లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ, 2013లో నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, 2014లో సూర్యాపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి
తర్వాత విద్యుత్‌శాఖ, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మరోసారి సూర్యాపేట నుంచి బరిలో నిలిచి విజయం సాధించాడు. దీంతో మరోసారి కేసీఆర్‌ కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు.
————————————–
కేసీఆర్‌ సన్నిహితుడిగా ప్రశాంత్‌రెడ్డి ..
పేరు:  వేముల ప్రశాంత్‌రెడ్డి
విద్యార్హత : బీఈ సివిల్‌ (బాల్కి, కర్ణాటక)
తండ్రి: కీ.శే.వేముల సురేందర్‌రెడ్డి
తల్లి : మంజుల
భార్య : నీరజా రెడ్డి
కుమారుడు :  పూజిత్‌రెడ్డి, ఎంబీబీఎస్‌
కుమార్తె : మానవి రెడ్డి (బీటెక్‌), సీబీఐటీలో
జననం: 14.03.1966
బాల్యం విద్యాభ్యాసం : వేల్పూర్‌, కిసాన్‌నగర్‌
వృత్తి : ప్రఖ్యాత బిల్డర్‌గా హైదరాబాద్‌లో పేరుగాంచారు
ఉద్యమంలో చురుగ్గా :- 2001లో కేసీఆర్‌ స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో తండ్రి వేముల సురేందర్‌రెడ్డితో కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2010లో సీఎం కేసీఆర్‌ ప్రశాంత్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ సమ యంలో కేసీఆర్‌ ఇచ్చిన  పిలుపు మేరకు నియోజక వర్గంలో ఉద్యమాన్ని చేపట్టారు. సాగరహారం, అసెంబ్లీ ముట్టడి, రైల్‌రోకో, వంటావార్పు లాంటి అనేక ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో రైల్‌రోకో, ఇతర కేసులు ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గ అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చెక్‌డ్యామ్‌లు, ఇలా 40  ప్రత్యేక సాగునీటి పనులను రూ.200 కోట్లతో చేపట్టారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. 2018లో మరోసారి గెలుపొంది కేసీఆర్‌ మంత్రి వర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు.
——————————————————
ఓటమి ఎరగని నేతగా ఈటల గుర్తింపు…
పేరు : ఈటల రాజేందర్‌
పుట్టినతేదీ :  24-03-1964
తల్లిదండ్రులు : ఈటల వెంకటమ్మ, మల్లయ్య
స్వగ్రామం :  కమలాపూర్‌
విద్యాభ్యాసం :  బీఎస్సీ(బీజెడ్‌సీ), ఎల్‌ఎల్‌బీ డిస్‌కంటిన్యూ
వ్యాపారం :   1986 నుండి కోళ్ళపరిశ్రమ వ్యాపారం
కుటుంబం : భార్య జమునా, కూతురు నీత్‌, ఒక కొడుకు నితిన్‌
రాజకీయ నేపథ్యం :- 2002లో ఈటల టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో మొదటిసారిగా కమలాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌ లెజిస్లెషన్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌రావుపై 15,035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.దామోదర్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించిన రాజేందర్‌, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిని ఓడించారు. 2014లో కేసీఆర్‌ కేబినేట్‌లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈయనకు రెండోసారి కేసీఆర్‌ కొలువులో మంత్రిగా అవకాశం దక్కింది.
————————————
మంత్రి వర్గంలోకి ‘కొప్పుల’..
పేరు : కొప్పుల ఈశ్వర్‌
పుట్టిన తేదీ : 1959 ఏప్రిల్‌ 20
తల్లిదండ్రులు : మల్లమ్మ, లింగయ్య
విద్యార్హతలు  : డిగ్రీ
స్వగ్రామం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం
భార్య : స్నేహలత
పిల్లలు : కూతురు నందిని, అల్లుడు అనిల్‌, మనుమడు భవానీనిశ్చల్‌
రాజకీయ నేపథ్యం :- సింగరేణి సంస్థలో 20ఏళ్లపాటు ఉద్యోగిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్‌ రాష్ట్ర మిడ్‌క్యాప్‌ సంస్థ డైరెక్టర్‌గా.. మినిమమ్‌ వేజ్‌ అడ్వైజరీ బోర్డ్‌ డైరెక్టర్‌గా.. మేడారం నియోజకవర్గం దేశం పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2001 టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 జనవరిలో జరిగిన ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి 56 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో 28వేల ఓట్ల మెజార్టీతో అదేస్థానం నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దు కావడంతో ధర్మపురి నియోజకవర్గం నుంచి 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2010 ఉప ఎన్నిక, 2014 సాధారణ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరుసగా ఓడించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రిపదవి దక్కింది.
———————————————–
తొలిసారి మంత్రిగా చామకూర మల్లారెడ్డి …
పేరు – చామకూర మల్లారెడ్డి
తల్లిదండ్రులు – చంద్రమ్మ, మల్లారెడ్డి
కుటుంబ నేపథ్యం – వ్యవసాయం, వ్యాపారం(మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్‌)
పుట్టిన తేదీ – 9-9-1953
విద్యార్హత – గ్రాడ్యుయేషన్‌
భార్య కల్పనారెడ్డి
పిల్లలు – కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, కుమార్తె మమత
¬దా – మేడ్చల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే
– చామకూర మల్లారెడ్డి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నివాసి. ఆయన చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తూ, పాల వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం చేస్తూ విద్యా సంస్థల అధినేతగా ఎదిగారు. కేజీ నుంచి పీజీ వరకు సీఎంఆర్‌ పేరిట విద్యా సంస్థలను స్థాపించారు. ఇంజనీరింగ్‌, వైద్య, బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వ్యాపారానికే పరిమితమైన ఆయన అనూహ్యంగా 2014లో టీడీపీ తరపున మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థంపుచ్చుకున్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచిపోటీ చేసి  భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పార్లమెంట్‌ స్థానానికి రాజీనామా చేశారు. మల్లారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఆ హావిూతోనే ఆయన తన ఎంపీ స్థానాన్ని వదులుకొని అసెంబ్లీకి పోటీ చేశారు. మంత్రివర్గంలో స్థానం కోసం చివరి వరకు ప్రయత్నించి తన కోరిక నెరవేర్చుకున్నారు.
———————————