తెలంగాణలో ఎంబిసిల అభివృద్దిలో సర్కార్‌ విఫలం

అసెంబ్లీలో నిలదీసిన సిపిఎం, బిజెపి

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అసెంబ్లీలో ప్రశ్రోత్తరాల సందర్భంగా సిపిఎం, బిజెపిలు విమర్శించాయి. ప్రబుత్వం ప్రకటించిన మేరకు కార్యక్రమాలు, పథకాలు అమలుకావడం లేదన్నారు. ఈ సమస్యపై మాట్లాడుతూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా విమర్శించారు. ఎంబీసీల సమస్యపై ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకంలో వీరు భాగస్వాములు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. సామాజిక వివక్ష గురవుతున్న ప్రజల సమస్యలను సర్కార్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు ‘మహాజన పాదయాత్ర’ జరిగిందని..ఈ పాదయాత్ర ఫలింగా ఎంబీసీలపై పలు వరాలు కురిపించిందని గుర్తు చేశారు. ఎంబీసీలకు వెయ్యి కోట్లు కేటాయించారని..ఎంబీసీల జాబితా ప్రకటిస్తామని..ఇటీవలే రూ. 280 కోట్లు విడుదల చేస్తామని చెప్పారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ నిధులు ఇంతవరకు కేటాయించలేదని, ఎంబీసీల ప్రాధాన్యత క్రమాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదని విమర్శించారు. ఎంబీసీలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలుఅత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ పేర్కొన్నారు.ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 54 శాతం ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ ఆనాడు సభలో ప్రకటించారని, అందులో వెనుకబడిన కులాలకు న్యాయం చేస్తామని పేర్కొంటూ ఎంబీసీ ఏర్పాటు చేస్తామని..వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొందని గుర్తు చేశారు. ఒక దుర్భర జీవితాలను వీరు గడుపుతున్నారని..ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకం..కార్యక్రమాల్లో వీరు భాగస్వామ్యం అవడం లేదన్నారు. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారని, ఎంబీసీ విషయంలో బీసీ కమిషన్‌ తమిళనాడు, కర్నాటక రాష్టాల్ల్రో పర్యటించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందచేసినట్లు సమాచారం ఉందన్నారు. 113 కులాలున్న తెలంగాణలో సామాజిక..ఆర్థిక స్థితి గతులను అధ్యయనం చేయాలని లక్ష్మణ్‌ సూచించారు. .