తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు

అభివృద్ది ప్రచారంతోనే మళ్లీ అధికారంలోకి వస్తాం: హరీష్‌ రావు
సిద్దిపేట,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్‌కు తెలంగాణలో తిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలను ఓట్లడిగే హక్కు తెరాసకు మాత్రమే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని మట్టిలో కలిపేస్తామని మంత్రి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ములుగు మండలంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాలతో పాటు కొండపోచమ్మ జలాశయం, విత్తన పార్కును ఏర్పాటు చేసినట్టు వివరించారు.  రాష్ట్రంలో వందకు పైగా సీట్లలో గెలుపొంది తిరిగి అధికారం చేపడతామని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పార్టీ వంద సీట్లు గెలుచుకొని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్‌ రావు ఆశాభావంవ్యక్తం చేశారు. తెలంగాణలో యాదవులకు గొర్రెల పంపిణీ చేసిన పథకం బాగుందని కర్ణాటక మంత్రి రేవన్న వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారని, కానీ అది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు కనబడడం లేదని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో కాంగ్రెస్‌ మాటలు కూడా అంతే అన్నారు. కాంగ్రెస్‌ తప్పుడు వాగ్దానాలు నమ్మితే ఇబ్బంది పడతామన్నారు. కారును కేసీఆర్‌ను మరువద్దన్నారు.