తెలంగాణలో ప్రజాస్వామ్య విజయం

తెలంగాణలో ఎన్నికలు జరుగుతన్న వేళ ధర్నా చౌక్‌ పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం కెసిఆర్‌ సర్కార్‌ తీరుకు చెంపపెట్టులా భావించాలి. ఈ ధర్నా చౌక్‌లోనే తెలంగాణ సాధన కోసం ఎన్నో సమావేశాలు, ఎన్నో ఆందోళనలు జరిగాయి. కెసిఆర్‌,కోదండరామ్‌ తితరులు ఇక్కడి నుంచే తెలంగాణుద్యమాన్‌ఇననడిపారు. ఇక్కడి నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇదే వేదికగా తెలంగాణ ఉద్యమం పునాదులు వేసుకుంది. ఆనాడు దీనిని ఉపయోగించుకుని ముందుకు నడిచిన కెసిఆర్‌ అధికారంలోకి రాగానే ఇక్కడ ధర్నాచౌక్‌ అక్కర్లేదని చెప్పి దానిని మూసివేయించిన తీరు ఆయన నిరంకుశ విధానాలకు అద్దం పట్టింది. ప్రజలెవరూ ధర్నా చేయొద్దు.. ప్రజలెవరూ ప్రగతి భవన్‌ ఛాయలకు రావద్దు.. ప్రజలెవరూ తనను కలవద్దు.. తాను చెప్పినట్లుగానే పాలన సాగాలి.. తాను చేపట్టిందే అభివృద్ది అన్న ధోరణిలో నాలుగేళ్ల తెరాస పాలన సాగింది. ధర్నా చౌక్‌ను మూయించడం ద్వారా ప్రజల గొంతుక నొక్కారు. రాజ్యాలు పోయి రాజులు పోయినా ప్రజాస్వామ్యంలో ఇంకా రాచరిక పోకడలు పోలేదనడానికి తెలంగాణ ప్రబల ఉదాహరణ. పెత్తందారీ వ్యవస్థ రద్దు కాలేదనడానికి నిదర్శనంగా కెసిఆర్‌ నిలిచారు. రాజులు చలాయించినట్లుగానే ఇప్పటికీ తెలంగాణ అధినేత కెసిఆర్‌ తన కనుసన్నల్లో పాలన సాగించారు. పెత్తనం ఏకవ్యక్తి చేతుల్లో నడువడం,ప్రజాస్వామ్మ స్ఫూర్తి కొరవడడం, తాము తీసుకున్న నిర్ణయాలను మమ అనిపించి అమలు చేస్తున్న తీరు కారణంగా అప్పుడప్పుడు న్యాయవ్యవవస్థ జోక్యం చేసుకోక తప్పడం లేదు. ప్రజాస్వామ్య ముసుగులో రాజరిక పాలన సాగించడంతో ఏకవ్యక్తి నిర్ణయాలు అమలువు తున్నాయి. దీంతో ప్రజల ఇష్టాఇష్టాలు, బాగోగుల గురించిన చర్చ జరగడం లేదు. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఈ రాచరిక వ్యవస్థ మరింతగా వేళ్లూనుకుంది. ఒక్క తెలంగాణలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఇది మనకు కనిపిస్తోంది. అయితే ధర్నా చౌక్‌ పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం..ఇదే సందర్భంలో చేసిన వ్యాఖ్యలను చూస్తే కెసిఆర్‌ ప్రభుత్వం నిరంకుశ విధానాలు ఎంతగా అమలువుతన్నాయో గమనించ వచ్చు. ప్రాంతీయ పార్టీల నేతలే అసలు సిసిలు రాజులుగా ఉంటున్నారనడానికి ఈ ఉదాహరణ చాలు. ఉద్యమపార్టీ నుంచి వచ్చిన నేత ఇలా నిరంకుశంగా వ్యవహరించడమే విచిత్రం కాక మరోటి కాదు.అంతే గాకుండా ప్రశ్నించే తత్వాన్ని కూడా భరించలేనంతగా నిరంకుశ విధానాలు సాగుతున్నాయి. రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరసనలను ప్రభుత్వం నిషేధించడాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో పాటు పలు వ్యాఖ్యలు చేసింది. నిరసన గళం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని, అటువంటి నిరసన గళాన్ని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్య హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సమావేశమయ్యే హక్కు దేశ పౌరులందరికీ ఉందని, సహేతుక ఆధారాలు లేకుండా ఈ హక్కులపై ఏకపక్ష ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని తేల్చి చెప్పింది. ఇవన్నీ కూడా కెసిఆర్‌ నిరంకుశ విధానాలపై హైకోర్టు గమనించిన అంశాలుగా చూడాలి. ధర్నాచౌక్‌ కాకుండా నిరసన కార్యక్రమాల నిర్వహణకు వేదికగా సరూర్‌నగర్‌ స్టేడియాన్ని ఎంపిక చేశామని చెప్పడం సిగ్గుచేటు. ఎన్నో ఏళ్లుగా ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలు జరుగున్నాయి. ప్రజలు తమకు జరిగిన, జరుగుతన్న అన్యాయాలను ఇక్కడికి వచ్చి ఏకరువు పెడుతున్నారు. ఇలా సమస్యల కోసం ఆందోళనలు జరిగితేనే ప్రజల్లున్న బాధ తెలిసేది. ఆ బాధలను

పరిస్కరించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. కానీ బాధలు లేకుండా చేయాల్సిన వారు బాధలను చెప్పుకునే హక్కును కూడా కాలరాయం అన్నది కెసిఆర్‌కు మాత్రమే చెల్లింది. ధర్నాచౌక్‌ వద్ద నిరసనలు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న కారణంగా ప్రబుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తేయాలని నిర్ణయించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. నిజానికి ధర్నాలుచేస్తే సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. అది పాలకుల విధానం కావాలి. ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమాలు పెట్టుకోవద్దంటే జనాలు ఉన్న చోట కాకుండా అడవుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలా? అని కూడా ధర్మాసనం ఘాటుగానే వ్యాఖ్యానించింది. ఇంట్లో ఏడుస్తున్న పిల్లాడిని పైగదిలోకి వెళ్లి ఏడువు అన్నట్లు విూ వాదన ఉందన్న వ్యాఖ్య కెసిఆర్‌ సర్కార్‌ తీరును వెల్లడించింది. నిరసనల వల్ల ఇబ్బంది ఉంటే అర్థవంతమైన ఆంక్షలు విధించండి. పరిమితులు, షరతులతో అనుమతులివ్వండని సూచించింది. అంతేకానీ నిరసన గళాలు వినిపించకుండా చేస్తామంటే ఎలా? ఇంకా ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతోందంటే ఈ నిరసన గళాలే కారణం. ఇవే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఇవి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని కూడా తేల్చి చెప్పింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కోసం ప్రజల నిరసన గళాలను అడ్డుకోమంటారా? ఈరోజు ధర్నాచౌక్‌ వద్ద నిరసనలు చేపట్టడానికి వీల్లేదంటారు. రేపు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలని కూడా నిర్ధేశిస్తారు. విూ ప్రభుత్వ వాదనతో మేం ఎంత మాత్రం ఏకీభవించడం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. సమస్యలు పరిష్కరించలేని పాలకులు ఉన్నంత కాలం ఇలాంటి నిర్ణయాలే ఉంటాయనడానికి ధర్నాచౌక్‌ మూసివేయించిన తీరు అద్దం పడుతుంది.