తెలంగాణలో ప్రాజెక్టులను.. అడ్డుకొనే ఉద్దేశం బాబుకు లేదు

 

– తప్పుడు పేపర్లతో కేసీఆర్‌ ప్రజలను నమ్మించలేరు

– చంద్రబాబు, వైఎస్‌ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది

– మిగులు ఆదాయం రాష్ట్రంలో ఉన్నామంటే ఆ ఘనత వారిదే

– నాలుగేళ్లలో కేసీఆర్‌ఏం చేశాడో చెప్పాలి

– పార్లమెంట్‌లో తెలంగాణకోసం ఎక్కువసార్లు మాట్లాడింది టీడీపీనే

– 80స్థానాల్లో కూటమి విజయం ఖాయం

– విలేకరుల సమావేశంలో ఖమ్మం టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు

ఖమ్మం, నవంబర్‌20(జ‌నంసాక్షి) : తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకొనే ఉద్దేశం బాబుకు లేదని, కానీ కేసీఆర్‌ తప్పుడు పత్రాలతో ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్‌ను రగిల్చి లబ్ధిపోందేందుకు బాబును వాడుకుంటున్నారని ఖమ్మం మహాకూటమి(టీడీపీ) అభ్యర్ధి నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఖమ్మంలో జరిగిన సభలో కేసీఆర్‌ మాట్లాడిన భాషపై నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది అని అహంకారం వద్దన్నారు. తెలంగాణలో గెలిచేది అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమే అన్నారు. తెలంగాణలో చంద్రబాబు, వైఎస్‌ హయాంలో ఊహించని అభివృద్ధి జరిగిందని నామా అన్నారు. ఆనాడు చంద్రబాబు, వైఎస్‌ తీసుకున్న నిర్ణయాలు మూలంగానే నేడు మిగులు ఆదాయం రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో నిధులు , నియామకాల్లో తెలంగాణకు అన్యాయం విషయంలో పార్లమెంట్‌లో టీడీపీ ఎక్కువ సార్లు మాట్లాడిందని నామా అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు అడ్డుకునే ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన సభలో కేసీఆర్‌ తప్పుడు పేపర్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని విమర్శించారు. తెలంగాణలో ఐటెక్‌ సిటీ, అవుటర్‌ రింగ్‌రోడ్డు, గ్రీన్‌ ఫిల్ట్‌ ఎయిర్‌ పోర్టు, హైదరాబాద్‌ ట్విన్‌ సిటీస్‌గా ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ వచ్చి నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ ఏంచేశారో చెప్పాలన్నారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ రైల్వేకోచ్‌, ట్రైబల్‌ యూనివర్శిటీ ఎందుకు తీసుకురాలేక పోయారో చెప్పలేక పోయాడని అన్నారు. 2014లో నార్త్‌, సౌత్‌ పవర్‌

గ్రిడ్లు ఓపెన్‌ కావడం, వాటికి తోడు సోలార్‌ ప్లాంట్లు విరివిగా అందుబాటులోకి రావడం వల్ల అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందని నామా అన్నారు. కేసీఆర్‌ వాడే భాషను ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. దేశమొత్తం మెచ్చిన చంద్రబాబును నిందించడం కేసీఆర్‌ అవివేకమన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు కేసీఆర్‌ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నీ ఇష్టానికి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలిసన అవసరం ఎందుకు వచ్చిందో కేసీఆర్‌ చెప్పకుండా తిరుగుతున్నారని అన్నారు. తెలంగాణలో 80కిపైగా మహాకూటమి సీట్లు సాధిస్తుందని నామా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా నాలుగేళ్ల తెరాస పాలన పట్ల విసుగుచెందారని అన్నారు. ఫలితంగా డిసెంబర్‌7న జరిగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని నామా పర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ కుమార్‌, కాంగ్రెస్‌ నేతలు యూనిస్‌

సుల్తాన్‌, స్థానిక కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, బాలగంగాధర్‌ తిలక్‌, తదితరులు పాల్గొన్నారు.