సింబయాసిస్ వర్సిటీని ప్రారంభించిన జైట్లీ

25-1469418370-symbiosisuniversity1 25-1469418389-symbiosisuniversity4 25-1469418409-symbiosisuniversity7 25-1469418428-symbiosisuniversity10హైదరాబాద్: చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యమని, దానికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష సాక్ష్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం అన్నారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి ప్రశంసనీయంగా ఉందని, రాబోయే దశాబ్దకాలంలో రాష్ట్రం గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌ను అరుణ్ జైట్లీ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. విశ్వవిద్యాలయం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడారు. దేశ అభివృద్ధి సగటుకన్నా తెలంగాణ అభివృద్ధే అధికంగా ఉందన్నారు. ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ ఏర్పడిందని, తాను 1950 నుంచే చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా వాదాన్ని వినిపించానని చెప్పారు. చిన్న రాష్ట్రాల్లో త్వరిత అభివృద్ధికి అవకాశముంటుందన్నారు. పంజాబ్ విడిపోగా ఏర్పడిన హిమాచల్, హర్యానా, పంజాబ్ మూడూ మంచి అభివృద్ధి సాధించాయన్నారు. వాజపాయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పాటు చేశామని, అవి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. తెలంగాణకు హైదరాబాద్ మంచి ఆస్తిగా అని జైట్లీ చెప్పారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అన్నారు. ఐటీ, స్థిరాస్తుల వ్యాపారం, ఇతర ఆర్థిక వనరుల కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తిచూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్నే కాకుండా విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ఇపుడు ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందన్నారు. సింబయాసిస్ లాంటి యూనివర్సిటీలు ఇక్కడ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రావడానికి స్ఫూర్తినిస్తాయన్నారు. అయితే హైదరాబాద్, దాని శివారుతో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి పైనా దృష్టి పెట్టాలన్నారు. పట్టణాల ద్వారానే ప్రజలకు ఎక్కువగా అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. విద్యారంగం గురించి మాట్లాడుతూ… విద్యార్థులు చదువును ఆషామాషీగా తీసుకోరాదన్నారు. గతంలో అరవై ఏళ్ల వయస్సులో మాత్రమే కంపెనీల సీఈవోలుగా, యాజమానులుగా అవకాశాలు వచ్చేవని, ఇపుడు ముప్పై ఏళ్ల వారే సీఈవోలు, ఎండీలు, ఎడిటర్‌లుగా మారుతున్నారన్నారు.
సింబయాసిస్ ప్రారంభోత్సవం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ‘ఆలోచించు.. ఆవిష్కరించు.. స్థాపించు..’ అనే విధానంతో తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. మన దేశంలోని నగరాలతో పోటీ తమ లక్ష్యం కాదని, ప్రపంచ నగరాలతో పోటీయే లక్ష్యమన్నారు.
26 ప్రపంచ నగరాలతో పోటీపడి యాపిల్‌ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌ దక్కించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యంత మెరుగైనదిగా గుర్తింపు పొందిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1200 పరిశ్రమలు ఏర్పాటు కాగా.. 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని, రూ.35000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
సింబయాసిస్‌ పుణెలో ఉన్నట్లుగా 45 కోర్సులను ఇక్కడి క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీ హబ్‌, టాస్క్‌ తరహాలో మరో రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకువెళ్తున్నదని కేటీ రామారావు అన్నారు
అమెరికా అభివృద్ధి చెందడానికి ఎంఐటీ, శాన్‌ఫార్డ్, హర్వర్డ్ లాంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు అక్కడ ఉండటం కారణమని అభిప్రాయపడ్డారు. ఇక్కడ కూడా ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించేలా చట్టం తీసుకురావాలనే అలోచన సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు.