తెలంగాణ అభివృద్దికి పోరాడుతా

కెసిఆర్‌ సారథ్యంలో రాజకీయాల్లో మార్పులు: నామా
ఖమ్మం,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను
అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌ పాలనను మెచ్చి ఆయనతో కలిసి నడిచేందుకే టీఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనను మంగళవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాజకీయాలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ శక్తులకు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం దేశంలో ఉందని, అది కేసీఆర్‌ వలనే సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కేసీఆర్‌కు ఉన్న విజన్‌తో ముందుకు వెళ్తే దేశం అగ్రగామిగా నిలుస్తారన్నారు. 16 ఎంపీ స్థానాలను గెలవడం ఖాయమని, ఖమ్మంలో మంచి మెజార్టీ సాధించుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు సాగునీటి కోసం ఎంతో కష్టపడ్డామని, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు. గతంలో ఎంపీగా పని చేసిన సమయంలో ఖమ్మం జిల్లా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా పనిచేశానన్నారు. బయ్యారం స్టీలుప్లాంట్‌, కొవ్వూరు రైల్వే లైన్‌ను తన హయాంలోనే సాధించుకున్నామన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి వల్లే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని నామా స్పష్టం చేశారు. అందరి వారిగా ఉంటానని, మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో తనకు భాగస్వామ్యాన్ని కల్పించాలని నామా కోరారు.  ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, అంతా కేసీఆర్‌ గ్రూపేనని, సీఎం డైరెక్షన్‌లోనే ముందుకు వెళ్తామన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, స్పష్టం చేశారు.