తెలంగాణ అసెంబ్లీ రద్దు

అత్యవసరంగా భేటీ అయిన కేబినేట్‌

అసెంబ్లీ రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానానికి ఆమోదం

కేబినేట్‌ తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్‌

వేగంగా మారిన రాజకీయ పరిణామాలు

నాలుగేళ్ల మూడు నెలలకే ముగిసిన కొత్త రాష్ట్ర అసెంబ్లీ చరిత్ర

ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న కెసిఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఉత్కంఠకు తెరపడింది. కేబినేట్‌ నిర్ణయం మేరకు తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేవలం నాలుగు నిముషాల పాటు జరిగిన కేబినేట్‌ అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించింది. ఆ వెంటనే రాజ్‌భన్‌కు బయలుదేరి రద్దు సిఫార్సును సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌కు అందచేశారు. రద్దు సిఫార్సును లేఖ ద్వారా గవర్నర్‌కు అందజేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై వివరణ ఇచ్చారు. దీనికి గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపారు. కేబినేట్‌ తీర్మానాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌ ప్రకటన విడుదల చేశారు. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం మరో చరిత్ర సృష్టించింది. కేవలం నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే అసెంబ్లీ రద్దు కావడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇకపోతే అసెంబ్లీ రద్దుపై గత కొన్ని రోజులుగా దీనిపై జోరుగా ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడా అధికారికంగా వెల్లడించకపోయినా జరుగుతున్న పరిణామాలు అసెంబ్లీ రద్దుకు దారితీసాయి. ప్రగతినివేదన సభతో ఈ విషయం తేటతెల్లం అయ్యింది. ఇకపోతే ఉదయం నుంచి కేబినెట్‌ భేటీపై సస్పెన్స్‌ కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు మంత్రిమండలి చేసిన తీర్మానం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అసెంబ్లీ రద్దుకు చేసిన తీర్మానం ప్రతిని కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలను గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించారు. తర్వాత ఆయన గన్‌పార్కుకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలు విూడియా ద్వారా కెసిఆర్‌ వెల్లడించనున్నారు. తెలంగాణ శాసనసభ రద్దునిర్ణయం, ముహూర్తం, తేదీ, సమయాలను కూడా ముందే కెసిఆర్‌ నిర్ణయించుకున్నారు. జ్యోతిష్యులు, పండితుల సలహాలు తీసుకుని అసెంబ్లీ రద్దు పక్రియను కేసీఆర్‌ పకడ్బందీగా అమలు చేశారు. ఎక్కడా లీక్‌ కానివ్వనప్పటికీ నిరంతరం జరిగిన పరిస్థితులను అంచనా వేయడంతో అసెంబ్లీ రద్దు అవుతుందని తేలింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని.. కొద్ది రోజులుగా కథనాలు వచ్చాయి. ఈ మేరకు ఆయన ఈ నెల 2న ప్రగతినివేదన సభను భారీగా నిర్వహించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తొలి ప్రభుత్వం రద్దయింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ టీఆర్‌ఎస్‌ మంత్రి మండలి ఏకగీవ్ర తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించడంతో ప్రభుత్వం అధికారికంగా రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో 4రాష్ట్రాలతతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ కొనసాగనున్నారు. సిఎం కెసిఆర్‌ ముందే నిర్ణయించుకున్న మేరకు కేబినేట్‌ భేటీని నిర్వహించారు. అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నాక ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీలో

అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కేబినెట్‌ తీర్మానం కాపీని అందజేశారు.అంతకుముందు రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. మొత్తంగా కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. అసెంబ్లీని రద్దు చేస్తూ రాజ్‌భవన్‌ ప్రకటన ఇచ్చింది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి పంపనున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే దానిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ కోరనున్నారు.