తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల 

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు 4,55,789 మంది విద్యార్థులు రాయగా.. 2,84,224 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇంటర్‌ సెకండియర్‌లో 4,29,378 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 62.3, ద్వితీయ సంవత్సరంలో 67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.

బాలిక‌ల‌దే పైచేయి
ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌లు స‌త్తా చాటారు. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరాల ఫ‌లితాల్లోనూ వారిదే అగ్ర‌స్థానం. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో బాలిక‌లు 69శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా.. బాలురు 55.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ద్వితీయ సంవ‌త్సరంలో బాలిక‌ల ఉత్తీర్ణ‌త 73.25 శాతం కాగా.. బాలురు 61శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ఉత్తీర్ణ‌త‌తో మేడ్చ‌ల్ జిల్లా తొలిస్థానంలో నిల‌వ‌గా.. రంగారెడ్డి రెండోస్థానంలో నిలిచింది. ద్వితీయ సంవ‌త్స‌రంలో మేడ్చ‌ల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు 80శాతం ఉత్తీర్ణ‌త‌తో ప్ర‌థ‌మ స్థానం సాధించాయి. 77శాతంతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో నిలిచింది. 40శాతం ఉత్తీర్ణ‌త‌తో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అట్ట‌డుగున నిలిచింది.