తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్‌నే విమర్శిస్తారా: డిసిసి

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే అపహాస్యం చేసేలా టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, దీనిని చూసి జనం నవ్వుకుంటున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, తెలంగాణకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని ఇప్పుడు మాట్లాడటం ఏదరుదాటిన తరవాత తెప్పతగిలేసిన చందంగా ఉందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌లా కాంగ్రెస్‌ నేతలు దొంగ దీక్షలు చేయలేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్‌ చేయడంలో సోనియాగాంధీ కీలకంగా వ్యవహరించిన కారణంగానే ప్రత్యేక తెలంగాణ సాధ్యమయ్యిందని అన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారా కెసిఆర్‌, ఆయన అనుయాయులు తమ నీచ నైజాన్నిచాటుకున్నారని విమర్శించారు. రైతు జపం చేస్తున్న సిఎం కెసిఆర్‌ తక్షణం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రైతుబందులో జరుగుతున్న అక్రమాలను గుర్తించడం లేదన్నారు. పెద్ద రైతులకు, సాగులో లేని భూములకు ఎలా పథకాన్ని అమలు చేస్తారని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్‌ రైతులకు ఒకేసారి రుణ మాఫీ ఎందుకు చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాల కారణంగానే తెలంగాణ రైతాంగం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను రాయితీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయాలని, రైతు అనుకూల విత్తన చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

——