. తెలంగాణ దేశానికే ఆదర్శం 

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం 

‘కరోనా’కు మతం రంగు పూయొద్దు

– జనవరిలోనే హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

– అప్పుడే అప్రమత్తమై విదేశీ ప్రయాణికులను క్వారంటైన్ కు తరలిస్తే పరిస్థితి ఇలా ఉండకపోయేది

– కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మార్కజ్ నిజాముద్దీన్ పేరిట రచ్చ

– ఢిల్లీ పోలీసు యంత్రాంగమంతా కేంద్రం ఆధీనంలోనే –

ఢిల్లీలో ఉన్నోళ్ళను అక్కడే కట్టడి చేస్తే రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉండేది

– లక్షలాది మంది వలస కూలీలు రోడ్ల మీదకు వచ్చినా నియంత్రించలేని దుస్థితి

– బస్సుల్లో కుక్కి పక్క రాష్ట్ర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసిన అక్కడి ప్రభుత్వం

– అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని ముందే సూచించిన తెలంగాణ సీఎం కెసిఆర్

– అందరికన్నా ముందే అప్రమత్తమై సెలవులు, లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమే

– మార్కజ్ గురించి తెలంగాణ ప్రభుత్వం తెలియచేశాకే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

– మార్కజ్ తో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన వారందరూ ఆరోగ్య పరీక్షలకు, క్వారంటైన్ కు సహకరించాలి

– కుటుంబానికి, సమాజానికి క్వారంటైనే రక్ష ‘జనంసాక్షి ప్రత్యేక కథనం

హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తుంటే ఒక్కసారిగా ఉరుమురిమి మంగళం మిద పడ్డట్టు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కేవలం మార్కజ్ నిజాముద్దీన్ మాత్రమే కారణం అన్నట్టుగా చిత్రీకరించాలని చూడటం దారుణం. మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ఏకతాటిపై నడుస్తున్న సమయంలో కొందరు ఈ వైరసకు అత్యంత ప్రమాదకరమైన మతం రంగును పూయాలని చూడటం జుగుప్సాకరం. అందులోనూ భారత దేశాన్ని గౌరవిస్తూ హిందూ దేవుడైన గణేషుడి చిత్రపటాన్ని తమ కరెన్సీ నోట్ల పైన ముద్రించుకున్న ఇండోనేషియన్లను బూచిగా చూపడం మరీ విచిత్రంగా ఉంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరు ప్రపంచదేశాలకు ప్రమాదకరంగా మారబోతుందని జనవరి ఇరవై తొమ్మిది నాడే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనతో పాటు సాధారణ కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇచ్చింది. మన దేశంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు జనవరి ముఫ్పైన నమోదైన అనంతరం కూడా ఈ వైరస్ విదేశాల నుండి రాకుండా కట్టడి చేసేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అందరి మాదిరిగానే ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 13, 14, 15 తేదీలలో నిర్వహించిన మార్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనలకు మూడు వందల మంది విదేశీయులు హాజరైనారు. వీళ్ళందరూ వీసా తదితర ప్రభుత్వ అనుమతులతో వచ్చినవారే అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. మరో విచిత్రం ఏందంటే దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే కూడా కరోనాతో ఇబ్బందేమీ లేనందున హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో చాలా రాష్ట్రాల్లో ప్రజలు కూడా కరోనాను తేలికగా తీసుకున్నారు. కొన్ని ప్రధాన ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మార్చి ఇరవై వరకు తెరిచే ఉన్నాయి. పరిస్థితి విషమిస్తుండటంతో అకస్మాత్తుగా మార్చి పందొమ్మిది రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ యుద్ధాలకు మించి కరోనా ప్రభావం ఉందని, ఇరవై రెండున జనతా కర్ఫ్యూ పాటించి సంకల్ప బలం చూపాలని పిలుపునిచ్చారు. ఇరవై రెండు తారీఖు వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగాయి. అప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడంతో పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, కొన్ని దేశాల నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ కు తరలించడం, ఫంక్షన్ హాళ్ళు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, మాల్స్ వంటి వాటిపైన ఆంక్షలు విధించడం లాంటి చర్యలు తీసుకోవడంతో కరోనా ప్రభావం తెలంగాణలో తక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. ఢిల్లీలోని మార్కజ్ నిజాముద్దీన్ నుంచి అక్కడి భక్తులు వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది తెలంగాణ ప్రభుత్వమే కావడం గమనార్హం. మార్కజ్ వెళ్లివచ్చిన ఆరుగురు కరోనా భాదితులు తెలంగాణలో మృతి చెందిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన అనంతరమే ఈ అంశం మీద అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆర్ధిక శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను నేరుగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తెలియచేస్తుండటంతో ప్రజలు కూడా ధీమాగా ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్న తీరు అభినందనీయం. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడి కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతుంటే ఆ కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరులా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించడం విచారకరం. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యములో ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందున భవిష్యత్తు రాజకీయావసరాల కోసమే ఈ పన్నాగం అనిపిస్తుంది. ఏది ఏమైనా కొందరు చేసే ఆరోపణలతో భయాందోళనలకు గురి కాకుండా మార్కతో పాటు విదేశాలకు వెళ్లివచ్చిన వారందరూ ఆరోగ్య పరీక్షలకు, క్వారంటైనకు సహకరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మనం ఉంటున్న సమాజం కూడా క్షేమంగా వర్ధిల్లేందుకు దోహదపడిన వారవుతారు.