తెలంగాణ పల్లెల్లో పంచాయితీ సందడి

ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే
హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది.. త్వరలోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో పల్లెల్లో ముందస్తు పంచాయతీ సందడి మొదలైంది. ఈ సారి ఎన్నికలు ప్రత్యక్ష విధానామా.. పరోక్ష విధానమా.. అనేది త్వరలోనే స్పష్టత రానుంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనే ప్రచారంతో.. పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తారనే ప్రచారంతో పల్లెల్లో తాజాగా గ్రామ పంచాయితీ జోరుగా రాజుకుంటోంది. పాత వాటితో పాటు కొత్తగా ఆవిర్భవించే గ్రామ పంచాయతీలకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రకటనతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. వచ్చే జూలై నాటికి పాలక వర్గాలకు గడువు ముగుస్తుండగా.. ఆ లోపే ఎన్నికలు నిర్వహించి కొత్త వారికి శిక్షణ ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉంది. దీంతో అటు అధికార యంత్రాంగంతో పాటు.. ఇటు రాజకీయ నాయకులు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టారు.  గ్రామాల్లో నాయకులు పంచాయతీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. ఆయా పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు 500కుపైగా జనాభా ఉన్న తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా.. మరికొన్ని అనుబంధ గ్రామాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.  నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు గడువు ఉంది. గతంలో గ్రామ పంచాయతీ
ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించారు. గతంలో వచ్చిన ఆదేశాల మేరకు బ్యాలెట్‌ బాక్సులను ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టగా.. ఇప్పటి నుంచి గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. జిల్లాల విభజన నేపథ్యంలో గతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలనే కొనసాగించాలా.. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా.. అనే అంశంతో పాటు ఆయా జిల్లాలు, పంచాయతీలు, వాటి పరిధిలో కావాల్సిన పోలింగ్‌ బూత్‌లపై సమాచారం తెప్పిస్తోంది. ఆయా జిల్లాల్లో పోలింగ్‌ బూతుల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయో.. లేవో పరిశీలన చేపడుతున్నారు.
జిల్లాల విభజన జరిగిన తర్వాత  ఆయా పంచాయతీలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన పోలింగ్‌ బూతులు, సౌకర్యాలు, మార్పులు చేర్పుల లాంటి అంశాలు అధికారులు పరిశీలిస్తున్నారు. 500జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా మారుస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు కొత్త పంచాయతీల జాబితా సర్కారుకు చేరింది. వీటితో పాటు మరికొన్ని తండాలు, గ్రామాలను పంచాయతీలుగా మార్చాలని కోరుతూ.. తాజాగా వినతులు, ప్రతిపాదనలు వస్తున్నాయి. వీటిని జిల్లా పంచాయతీ అధికారులు స్వీకరించి.. సర్కారుకు పంపేందుకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో కొత్త పంచాయతీల ఏర్పాటుపై పూర్తి స్పష్టత రానుంది. ఒకవైపు కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు సర్కారు పంపుతూనే.. మరోవైపు ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 3-15 వరకు గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలున్నాయి. గిరిజన గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాల పనుల కోసం గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లడం కష్టంగా ఉండడంతో.. తాజాగా ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తుండటంతో గిరిజనులకు ఉపయోగకరంగా మారనుంది.  కొత్తగా మరికొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత పంచాయతీలో జనాభా, పంచాయతీ నుంచి దూరం, వార్షిక రాబడి వంటి వివరాలతో నివేదికలు పంపారు. తండాల జనాభా 500, అంతకు మించి ఉండాల్సి ఉంటుంది. మూడు కిలోవిూటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ఉన్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు దృష్టి పెట్టారు. ఒకే తండాలో 500జనాభా లేకుంటే.. వివిధ తండాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు.
——–