తెలంగాణ యాసను కాపాడుకోవాలి

కరీంనగర్‌,డిసెంబర్‌13(జ‌నంసాక్షి): ప్రస్తుత సమాజంలో పరభాష అవసరమే కానీ తెలంగాణ యాసను ప్రాణంగా భావించి తెలుగుభాషను బతికించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు తెలంగాణ కవులు అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది అనాదిగా వస్తున్నా, తెలంగాణ యాసలో ఉన్నంత మాధుర్యం,ప్రాణం మరెక్కడా లేదన్నారు. యాసే తెలంగాణకు ప్రాణమన్నారు. తెలుగు ఎంత మాధుర్యమో తెలంగాణ యాస అంతకన్నా గొప్పదని జానపద కళాకారులు కూడా అభిప్రాయ పడ్డారు. ఎంతో మంది… ఎన్నో సందర్భాల్లో తెలుగుభాష గొప్పతనం గురించి అభివర్ణించారని అంతటి ప్రాముఖ్యత ఉన్న తెలుగు భాషలో పలు యాసలున్నాయని అన్నారు.  తెలుగు యాసలందు తెలంగాణ యాస లెస్స అని మాతృభాష తరగని సిరి అని అన్నారు. వాటి మూలాలను రక్షించడం మనకు ముఖ్యమని అన్నారు.  ఉమ్మడి ప్రభుత్వాల పక్షపాత పాలన ప్రభావం మన తెలంగాణ యాసపై పడిందన్నారు. తెలంగాణ యాసను అణగదొక్కాలనుకోవడం, దానిని వెక్కిరించడం వంటివి గతంలో అనేకం జరిగాయని కరీంనగర్‌కు చెందిన విశ్రాంత అధ్యాపకుడు కవి డిండరి నరహారాచారి అన్నారు.  యాసను అణగదొక్కాలనే నిరంకుశత్వానికి నాటి నాయకులు దిగజారారన్నారు. తెలంగాణ యాసను కాపాడుకోవడం కూడా తెలుగు భాషను కాపాడుకునే క్రమంలో ఒకటని అన్నారు.  తెలంగాణ తెలుగును సైతం కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ తెలుగు భాష అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. వీటిని మళ్లీ కొనసాగించాలని అన్నారు.