తెలంగాణ రైతుకు బీమా భరోసా

ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆయన కుటుంబం దిక్కులేనిదవుతున్నది. కనీసం బీమా కూడా దక్కని దుస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా బీమా గురించి ఆలోచించ లేదు. ఇప్పటికే రైతుబంధుతో వారికి ఎకరాకు నాలుగువేల పెట్టుబడి సాయం అందింది. అదేస్ఫూర్తితో ఆగస్టులో బీమా పథకం అమలు కాబోతున్నది. నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేయబోతున్నారు. ఆగస్ట్‌ నుంచే దానిని అమల్లోకి తీసుకుని రావడం ద్వారా ఇక రైతులకు సంపూర్థ భరోసా దక్కనుంది. అన్నదాతలకు అండగా ఉంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీమా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నది. ఇప్పటికే పెట్టుబడి సాయంతో దేశంలో నంబరన్‌వన్‌ గా నిలిచిన ప్రభుత్వం వారికి బీమా పథకాన్ని కూడా తేనుంది. ప్రభుత్వం తీసుకొచ్చే పథకం యావత్తు దేశానికి మార్గదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎల్‌ఐసీ అధికారులతో క్షుణ్ణంగా చర్చించి, బీమా చెల్లింపులతో పాటు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందిం చారు. మృతి చెందిన వ్యవసాయదారుడి కుటుంబానికి బాసటగా నిలిచేలా బీమా పథకం ఉండబోతున్నది. రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఉచితంగానే రైతులకు బీమా అందించాలని సంకల్పిం చారు. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతు జీవిత బీమా పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది చిరకాలం వర్ధిల్లే పథకం. కారణం ఏదైనప్పటికీ రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి తప్పకుండా తక్షణమే రూ.5 లక్షల బీమా సొమ్ము అందించాలి. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎలాంటి సహాయమైనా చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో ఈ పథకానికి మార్గదర్శకాలు రూపొందించారు. రైతులు వివరాఉల సేకరించారు. ప్రభుత్వ బీమా సంస్థతో చర్చించి విధివిధానాలు ఖరారు చేశారు. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల వ్యవసాయ రంగం కుదుట పడుతున్నది. ఈ మేరకు ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. రైతులు కూడా ఆమేరకు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ రైతుల సమస్యలను అర్థం చేసుకున్న సిఎం ఒక్కో పథకాన్ని ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ పథకానికి చెల్లించే ప్రీమియం ను బడ్జెట్‌లో కేటాయించి చెల్లింపు హావిూ ఇస్తాం అని సీఎం తెలిపారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడానికి రైతు బంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలను తీసుకొచ్చారు. ఏ కారణం వల్లనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోనే జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. చిన్న, సన్నకారు పెద్ద రైతులు అనే తేడా లేకుండా ఎవరు మృతిచెందినా ఒకే తరహా బీమా సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేయించాలని సూచించారు. దేశంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు పెద్ద యంత్రాంగం ఉంది. ఎల్‌ఐసీ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. ప్రజలకు ఈ సంస్థపై నమ్మకమున్నది. అందుకే రైతు జీవిత బీమా పథకాన్ని ఎల్‌ఐసీ ద్వారా అమలుచేయాలని నిర్ణయించారు. రైతులకు జీవిత బీమా పథకం దేశంలోనే మొదటిది. ఈ పథకం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతులలో వివిధ వయస్సు లకు చెందిన వారు ఉంటారు కాబట్టి ఎల్‌ఐసీ నిబంధనలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రైతు జీవిత బీమా పథకం ఎలా ఉండాలనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి, రైతులందరికీ వర్తించేలా నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించారు. ఈ మేరకు ఎల్‌ఐసీ అధికారులతో చర్చలు జరిపి తుది విధనాలు ఖరారు

చేశారు. గ్రామాలు, మండలాలవారీగా రైతులు, వారి నామినీల జాబితాలను రూపొందించే కార్యక్రమం పూర్తి కావచ్చింది. క్షేత్రస్థాయిలో సేకరించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పర్చారు. ఈ వివరాల ఆధారంగా రైతులకు బీమా అమలు చేయనున్నారు. ఆగస్ట్‌లో అమలు కాబోతున్న ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సవిూక్షిస్తోంది. రైతుల వివరాలను కలెక్టర్లు పర్యవేక్షించి జాబితాను రూపొందించారు. గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అవగాహన కల్పించారు. చైతన్య సదస్సులు నిర్వహించారు. రైతు సమన్వయ సమితులు తోడ్పాటును అందించాయి. మొత్తంగా రైతులకు బీమా అన్నది రాబోతున్నది. నాలుగేండ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుక్షణం అండగా నిలుస్తూ తీసుకున్న నిర్ణయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు దీనికితోడు బీమా అందించడంతో ఇక రైతులకు ఆత్మహత్యలు చేసుకునే అవసరం రాదు. వారికి భరోసా దక్కగలదు. అందుకు సిఎం కెసిఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి రైతులకు భరోసా దక్కితే అంతకన్నా మరోటి ఉండదు. ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు అభినందించాల్సిందే.