తెలుగు భాషను అగౌరవపరిస్తే..  మట్టిలో కలిసిపోతారు!

– వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారు?
– కులాలకు అతీతంగా, భాషాసంస్కృతులను కాపాడటమే జనసేన విధానం
– జగన్‌ రెడ్డి అంటే తప్పేంటి.. జాతీయ విూడియానే అలా పిలుస్తుంది
– జగన్‌ రెడ్డి అన్నందుకు.. పవన్‌ నాయుడు అంటూ హేలన చేస్తున్నారు
– ఎలా పిలవాలో 151మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి ఇవ్వండి
– జగన్‌ తిరుపతి ప్రసాదం తింటాడో తినడో తెలియదు
– జగన్‌ రెడ్డి క్రిష్టియన్‌ మతాన్ని విశ్వసిస్తారు
– అందులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది?
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
అమరావతి, నవంబర్‌14 (జనం సాక్షి) : తెలుగు భాషను అవమానపరిస్తే, అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని, ఇదే విషయాన్ని మరోసారి చెబుతున్నానని.. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్‌రెడ్డి తనతీరు మార్చుకోవాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఇతర రాష్టాల్రు తమ భాషా సంస్కృతులను కాపాడుకుంటుంటే.. జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇంగ్లీషే ముద్దు అంటున్నారని విమర్శించారు. గత తెదేపా హయాంలో సర్కార్‌ బడుల్లో ఇంగ్లీష్‌ విూడియం అమలు చేయాలని ప్రయత్నిస్తే.. జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేకించాడని, ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్‌ విూడియం అంటూ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అధికార పక్షంలో ఉంటే ఒకలా జగన్‌ వ్యవహరిస్తున్నారని పవన్‌ విమర్శించారు. జగన్‌ రెడ్డి అని పిలిస్తే తప్పేంటని పవన్‌ ప్రశ్నించారు. జగన్‌ రెడ్డిని ఆయన పేరు పెట్టి పిలిస్తే తప్పేంటో చెప్పాలన్నారు. జగన్‌ రెడ్డి అని పిలిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. పవన్‌ నాయుడు అని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్‌ రెడ్డి అంటే పవన్‌ నాయుడు అంటూ.. తనకు కులం ఆపాదించేందుకు ప్రయత్నించారన్నారు. జాతీయ విూడియా మొత్తం జగన్‌ రెడ్డి అనే అంటోందని, జగన్‌ను ఎలా పిలవాలో 151మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి, సమిష్టిగా నిర్ణయం తీసుకొని ప్రజలకు తెలియజేయాలంటూ పవన్‌ సెటైర్లు వేశారు. ‘జగన్‌ అనాలో, జగన్‌ రెడ్డి అనాలో, జగన్‌ మోహన్‌ రెడ్డి అనాలో, ఉత్తి జగన్‌ అనాలో, ఉత్తుత్తి జగన్‌ అనాలో’ తెలియజేయమని చెప్పండి.. అలానే పిలుస్తాం అన్నారు. బొత్స కూడా ఏమని పిలవాలో చెప్పాలన్నారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని అన్నారు. తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామన్నారు. తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని అంటే ఉద్దేశపూర్వకంగా అన్నానని మంత్రి బొత్స బాధపడిపోతున్నారని.. ముందు ఎలా మాట్లాడాలో వాళ్ల నాయకుడికి (జగన్‌కి) మంత్రి చెప్పాలన్నారు. మట్టిలో కలిసిపోతారనే మాటను ఆవేశంలో అనలేదని, తెలుగుభాషను విూరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరోసారి చెబుతున్నాను అని అన్నారు. తెలుగు భాషను చంపే ప్రయత్నం చేస్తుంటే. వైసీపీలోని మేధావులు ఏం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు. అందరం ఒకటే అనే భావన తెలంగాణ ప్రజలు, సమాజంలో ఉందని, ఏపీలో మాత్రం ప్రజలు వర్గాలుగా విడిపోయారన్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చరిత్రను చదివిన తర్వాత పార్టీ పెట్టాలనుకుని నిర్ణయించుకున్నానని.. కులమతాలకు అతీతంగా రాజకీయం చేయడం జనసేన పార్టీ విధానం విధానం అని పవన్‌ అన్నారు. భాషాసంస్కృతులను కాపాడటం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని కాపాడటం తమ సిద్దాంతమని, కుల నిర్మూలన తన ఆశయం అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.
జగన్‌ తిరుపతి ప్రసాదం తింటారా..
జగన్‌ రెడ్డి క్రిష్టియన్‌ మతాన్ని విశ్వసిస్తారాని, అందులో దాచుకోవాల్సిన అవసరం ఏముందని పవన్‌ ప్రశ్నించారు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదు కానీ.. అమిత్‌ షా కు ఇవ్వటానికి ఉపయోగపడుతుందని పవన్‌ కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణలో ఉన్నట్లు ఒకే జాతి అనే భావన ఏపీలో లేదని..ఇక్కడ కులాల వారీగా వ్యవహరిస్తున్నారని కామెంట్‌ చేసారు. అవినీతి రహిత రాజకీయం అంటే అందరూ నవ్వుతారని, అయినా మార్పు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని పవన్‌ చెప్పుకొచ్చారు. తమ పార్టీ భాషను గౌరవిస్తుందని స్పష్టం చేసారు. మనుషుల్ని చంపాక ఇసుక
వారోత్సవాలు చేయడం వికటాట్టహాసమని అన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారని, తానేం సరదాగా కావాలని చేసుకోలేదని పవన్‌ అన్నారు. అయినా తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స తమ నాయకుడికి చెప్పాలని సూచించారు.