తెలుగు రాష్ట్రాల్లో విద్వేష రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నేలవిడిచి సాము చేస్తున్నాయి. ప్రజలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు పెరిగాయి. వ్యూహాత్మకంగా ప్రధాన సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయడంలో టిఆర్‌ఎస్‌,టిడిపి, వైకాపా, జనసేన పార్టీలు సాగుతున్నాయి. జాతీయ పార్టీగా అధికారంలో ఉన్న బిజెపి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల సమస్యల కన్నా అధికార పార్టీలను తిట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలు అధికార పార్టీల తీరును నిరసిస్తూ వచ్చాయి. అయినా అధికార పార్టీల్లో చలనం కలగడం లేదు. నిజామాబాద్‌లో ఏకంగా 180మంది రైతులు బరిలోకి దిగారు. వారి సమస్యలు పరిష్కరించడం చిటికెలో పని. అయినా అధికారులు కానీ, నేతలు కానీ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం లేదు. అలాగే క్షేత్రస్థాయిలో  రైతుల భూసమస్యలు కోకొల్లలు. దేవాలయ భూములను అప్పనంగా ఆక్రమించుకుని దర్గా మేస్తున్న దగుల్బాజీలు కొందరు. రాజకీయ పార్టీల నేతలే అక్రమార్కులుగా కోట్లకు పడగలెత్తారు. ఇవన్నీ కూడా తప్పులుగా కనిపించడం లేదు. సమస్యలను చాలామంది రైతులు ఇప్పుడు నేరుగా సిఎం కెసిఆర్‌ దృష్టికే తెస్తున్నారు. తెలంగాన ఏర్పడ్డ తరవాత కూడా ఇలాంటి సమస్యలు రావడం బాధాకరం. ఇవన్నీ ఒక్క ఆదేశంతో చక్కబడాలి. కానీ కాసులకు కక్కుర్తి పడ్డ నేతలు, అధికారులు ప్రజల సమస్యలను అలాగే పెండింగ్‌లో పెట్డమో లేకపోతే తమకు అనుకూలంగా మార్చడమో చేస్తున్నారు. ఇకపోతే ఎదుటి పార్టీ వారిని చేర్చు కోవడమే ఘనకార్యంగా టిఆర్‌ఎస్‌ నేతలు చాటుకుంటున్నారు. తము చేసిన అభివృద్ది చూసి పార్టీలో చేరుతున్నారంటూ గొప్పగా చాటుకుంటున్నారు.ఇదేమి అభివృద్దో ప్రజలు గమనించాలి.ఇక ఎపిలో వైకాపా, టిడిపి దూషణల పర్వం కొనసాగుతోంది. విూదపడి కొట్టుకునేంతగా విమర్శలు చోటు చేసుకుంటు న్నాయి. రాజకీయాల్లో ప్రధాన సమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కరానికి హావిూలు ఇవ్వడం పక్కన పెట్టి తామే సర్వం జగత్తు అన్న విధంగా ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం తీరు దిగ్భాంతిని కలిగిస్తోంది. ప్రజా ప్రయోజనాల కన్నా అధికార సాధనే లక్ష్యంగా మారితే రాజకీయ పార్టీలు ఏ స్థాయికి దిగజారుతాయనడానికి రాష్ట్రంలో జరుగుతున్న ప్రచార పర్వమే నిదర్శనం. విలువలకు తిలోదకాలు ఇచ్చేలా రాజకీయక్రీడలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడుతున్న తీరు వాటి బాధ్యతారాహిత్య రాజకీయానికి అద్దం పడుతోంది. తెలుగుదేశం,టిఆర్‌ఎస్‌ల మధ్య, తెలుగుదేశం వైసిపిల మధ్య రాజకీయ వైరం ఉంది. కనుక విమర్శలు,ఆరోపణలు,ప్రత్యారోపణలు సహజం. కానీ, ఇది శృతి మించి తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి, అగాధాన్ని సృష్టించే దిశగా నడుస్తోంది. చంద్రబాబు కూడా చివరకు కెసిఆర్‌ను బూచిగా చూపి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. విజన్‌ ఉన్న నేతగా చెప్పుకుంటున్న చంద్రబాబు సెంటిమెంట్‌ రగిల్చి అధికారంలోకి రావాలని చూడడం ఆందోళనకరం. నిజానికి ఐదేళ్ల పాలన తరువాత చంద్రబాబునాయుడి వంటి నాయకుడికి చెప్పుకోవడానికి అంశాలకేవిూ కొరవ ఉండకూడదు. కానీ, ఆయన ప్రచారం జరుగుతున్న తీరు దానికి భిన్నంగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. పదే పదే తెలంగాణను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రస్తావించడమే విజయ వ్యూహంగా ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వం లోని వైసిపి గెలుపొందడం అంటే రాష్ట్ర పెత్తనం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల్లోకి వెళ్లిపోతుందని, టిఆర్‌ఎస్‌ పాలనే రాష్ట్రంలోనూ కొనసాగుతుందని ఆయన చెబుతున్నారు. పనిలో పనిగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్నీ ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ తరహా వ్యూహంతోనే తెలంగాణలో కెసిఆర్‌
వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కుంచుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు ఇప్పుడు అదే ఫార్మూలాను ఫాలో అవుతుస్తున్నారు. కాకపోతే, తనంత అనుభవజ్ఞుడు మరొకడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విద్వేష విషఫలితం తెలియక కాదు. తెలిసీ విషం చిమ్ముతున్నారంటే అధికార యావ తప్ప మరొకటి కాదు! తెలుగు ప్రజల మధ్య పూడ్చలేని అగాథమేర్పడితే, భావి తరాలు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతే దానికి బాధ్యత ఎవరన్న జ్ఞానం లేకుండా ప్రచారాలు సాగడం మంచిది కాదు. కావేరీ జలాల విషయంలో ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కలియబడేంతగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇది వాంఛానీయమా అన్నది దీనిని రగిల్చిన నేతలు చెప్పాలి. చంద్రబాబు రేపుతున్న విద్వేష జ్వాలలకు మరింత ఆజ్యం పోసే విధంగానే జగన్‌ ప్రచార సరళి కనపడు తోంది. కెసిఆర్‌ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన దాఖలాలే లేవు. పైగా కెసిఆర్‌ మద్దతు స్వీకరిస్తే తప్పేమిటన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తుండటం పుండు విూద కారం చల్లడమే తప్ప మరోటి కాదు. అంతేనా అంటే మొత్తం రాష్ట్రాని, వనరులను దోచిపెట్టేలా అంతా ఫ్రీ అన్న ప్రచారాన్ని చేపట్టారు. ఎవరు అడిగినా అడగకున్నా దానకర్ణుడిలా వాగ్దానాలు చేసేస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతకైనా తెగిస్తారని ఎపి ప్రచారాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి వాంఛనీయమా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. ఇకపోతే ప్రత్యేక ¬దాపై మోసగించిన బిజెపిని జగన్‌ పల్లెత్తు మాట అనకుండా వెనకేసుకు వస్తున్నారు. ప్రస్తుతం ¬దా, విభజన సమస్యలు కాకుండా వ్యక్తిగత దూషణలు, పొరుగు రాష్ట్రపు జోక్యాలు ఎన్నికల అజెండాగా మారాయి.  తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా కెసిఆర్‌ చూపితే ఇప్పుడు, చంద్రబాబు అదే బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహబందాన్ని పెంపొందిం చాల్సిన నేతలు రాజకీయ కక్కుర్తి కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి విషయాలపై ప్రజలు కూడా భావోద్వేగాలకు లోను కారాదు. లోతుగా ఆలోచించాలి. ఎవరు మంచినేతో ఎంచుకోవాలి. ప్రాంతీయ భావనలు దేశ పటిష్టతను దెబ్బతీస్తాయి. జాతీయ భావాలు రగిలించి ముందుకు నడపాల్సిన బిజెపి కూడా అధికారమే పరమావధిగా ఎన్నికల్లో ముందుకు సాగుతోంది.