తేనెటీగల దాడిచేసిన రైతులకు అందని వైద్యం

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇద్దరు రైతుల మృతి
బెంగళూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తేనెటీగలు కుట్టిన ఇద్దరు రైతులకు డాక్టర్లు సకాలంలో వైద్యం చేయకపోవడంతో వారు మరణించారు. ఈ  దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు రైతులు మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. బెంగళూరు నగరానికి 40 కిలోవిూటర్ల దూరంలోని న్లలెనహళ్లి గ్రామానికి చెందిన రామయ్య, హనుమయ్య మరో ఆరుగురితో కలిసి వస్తుండగా ఒక్కసారిగా లేచిన తేనెటీగలు వారిని కుట్టాయి. తేనెటీగలు కుట్టడంతో వారిని హుటాహుటిన 108 అంబులెన్సులో కనాసవాడి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రెండు గంటలు గడిచినా ఆసుపత్రికి డాక్టరు రాకపోవడంతో క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రామయ్య, హనుమయ్యలు మరణించారని ప్రకటించారు. మరో ఆరుగురికి చికిత్స చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రామయ్య, హనుమయ్యలు మరణించారని వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 304 ఏ కింద డాక్టర్లపై కేసు నమోదు చేశారు.