తొలగింపుపై మిస్త్రీ మండిపాటు

22558

ముంబయి,అక్టోబర్‌ 26(జనంసాక్షి):తనను అర్థాంతరంగా తొలగించారని టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీ బోర్డు సభ్యులకు ఈమెయిల్‌ ద్వారా వెల్లడించారు. పదవి నుంచి తనను తొలగించిన విధానంపై షాక్‌కు గురయినట్లు చెప్తూ మెయిల్‌ పంపారు. బోర్డు గౌరవప్రదంగా ప్రవర్తించలేదని, తనకు కనీసం తన వాదన వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని మిస్త్రీ బోర్డుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.తనను తొలగించిన విధానం దేశంలోనే ఇదివరకెన్నడూ జరగనిది, ఎప్పుడూ విననిది అని మిస్త్రీ మండిపడ్డారు. పలు విషయాల్లో రతన్‌ టాటా జోక్యం చేసుకోవడాన్ని విమర్శించారు. బోర్డులో 9 మంది సభ్యులుండగా ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు అనుకూలంగా ఓటు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీల కారణంగానే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని మిస్త్రీ తెలిపారు. వీటి కారణంగా టాటా ఆస్తుల్లో అంచనా వేసిన దానికంటే 18బిలియన్‌ డాలర్లు తగ్గనున్నాయని పేర్కొన్నారు.టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించి రతన్‌ టాటాను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. మిస్త్రీ న్యాయపరమైన చర్యలకు దిగుతారేమోనని యోచనతో టాటా గ్రూప్‌ సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టులతో పాటు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పరిస్థితిలో మిస్త్రీ న్యాయపోరాటానికి దిగట్లేదని ఆయన కార్యాలయం తెలిపింది.