తొలివిడత ఎన్నికలకు రంగం సిద్దం

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తుండగా అన్ని మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లాలో తొలివిడతలో నిర్వహించే 24 పంచాయతీలను అతి సమస్యాత్మకం, క్రిటికల్‌, సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి వెబ్‌, మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షణలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత జరిగే మండలాల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, విధులకు హాజరయ్యే సిబ్బంది ఈ నెల 20న సంబంధిత ఎన్నికల పంపిణీ కేంద్రాల్లో హాజరు కావాలని సూచించారు. ప్రతి పంచాయతీలో బూత్‌ల వారీగా స్వశక్తి మహిళా సంఘాలతో కమిటీలు వేసి ఓటు హక్కు వినియోగం, నైతిక విలువలతో సద్వినియోగం చేసుకునేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.తొలివిడతలో 131 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 1146వార్డులు ఉన్నాయని, ఇందులో 10 పంచాయతీలు, 62 వార్డులు ఏకగ్రీవమైనట్లు చెప్పారు. రెండో విడతలో 122 పంచాయతీలకు 1172 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా ఉప సంహరణ పక్రియ పూర్తి చేయగా బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆయా మండలాల్లోని 22 పంచాయతీల్లో ఒక్కొక్కరే నామినేషన్లు వేసినట్లు తెలిపారు. మూడో దశలో 127 పంచాయతీలు, 1182 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే మండలాలకు 2827 మంది సిబ్బంది, రెండో దశకు 2959 మంది, మూడో దశ ఎన్నికలకు 2888 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు.