త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం


మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్‌: భాగ్యనగరంలోని ఉస్మానియా వైద్యశాలకు త్వరలోనే కొత్త భవనం నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అసాధారణ వర్షాల నేపథ్యంలో ఆయన సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. వర్షాల వల్ల కల్గిన నష్టాలపై ఆస్పత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాత భవనాలపై సూపరింటెండ్‌కు పలు సూచనలు చేశారు. కొత్త భవనం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, త్వరలోనే సీఎం కేసీఆర్‌ శిలాఫలకం వేస్తారని మంత్రి వివరించారు. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం వందేళ్ల క్రితం నాటిదని, త్వరలోనే ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అప్పటివరకు పాత భవనంలోనే వైద్యసేవలు కొనసాగించనున్నట్లు స్పష్టంచేశారు. అధునాతన పరికరాలను ఆస్పత్రిలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మరో వారం పది రోజుల్లో నూతన పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.