థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతంతమాత్రమే

కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు
కామారెడ్డి,ఫిబ్రవరి8  (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్‌వేవ్‌ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్‌వేవ్‌లో చాలా మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరే తీవ్ర పరిస్థితి రాలేదు. జిల్లాలో రోజుకు సగటున 2 వేలకు పైగా అనుమానితులు కరోనా పరీక్షలు చేయించు కున్నప్పటికీ 200లకు పైగా పాజిటివ్‌ కేసులు మాత్రామే వచ్చాయి. కానీ వీరేవరు ఆసుపత్రుల్లో చేరిన దాఖలాలు లేవు. ఇంటి వద్దే ఉండి మందులు వాడడంతో వారం రోజుల్లో కోలుకున్నారు. థర్డ్‌వేవ్‌లో వైరస్‌ చాలా వ రకు బలహీన పడిరదని వైరస్‌ సోకిన వారిలో అంత ప్రభావం కనిపించలేదని వైద్యులు చెబుతు న్నారు. జిల్లాలో ఓ వైపు కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతునే ఇంటింటికీ వెళ్లి మందులు ఇవ్వడంతో కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఇంటింటి ఫీవర్‌ సర్వే జిల్లాలో డిసెంబరు నుంచి చేపట్టిన నాటి నుంచికరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. జనవరిలో కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజూ 200లకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి ఫీవర్‌ సర్వేను చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్నచర్యల కారణంగా జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని గుర్తించి ఇంటి వద్దనే మందుల కిట్లను అందించడంతో పాజిటివ్‌ కేసులకు అడ్డుకట్ట వేయగలిగారు. గ్రామాలు, పట్టణాల్లో వేగవంతం చేసి దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పు ఉన్న వారిని గుర్తించి మందుల కిట్లు అందజేశారు. వీరందరికి కరోనా మందుల కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. కరోనా థర్డ్‌వేవ్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతూ వచ్చినా.. ప్రభుత్వం తీసుకున్నచర్యలు ఫలించి కేసులు క్రమంగా తగ్గాయి. ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించడంతోనే వైరస్‌ భారిన పడిన వారిని వెంటనే గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచడంతోనే కేసులు తగ్గుముఖం పట్టినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా అవుతున్నప్పటికీ ముప్పు మాత్రం తక్కువగానే ఉంటూ వచ్చింది. చాలా మంది కరోనా బాధితుల్లో సాధారణ లక్షణాలే కనిపించడం ఊరట కల్పించింది. పాజిటివ్‌ వచ్చిన వారు వారం రోజుల్లో కోలుకున్నారు.ప్రధానంగా వ్యాక్సిన్‌ తీసుకోవడం, రోగనిరోధకశక్తి పెంచుకోవడంతోనే థర్డ్‌వేవ్‌లో వైరస్‌ను తట్టుకునే స్థాయి వచ్చిందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌ కట్టడికి వైద్యఆరోగ్యశాఖ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గుతున్నాయనే ఆలోచనతో చాలా మంది మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి తోడు శుభాకార్యాల ముమూర్తాలు ప్రారంభమైనందున పెళ్లిలు, ఇతర శుభ కార్యక్రమాలు ఉన్న సమయంలో జాగ్రత్తలు పాటించకుంటే వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉందంటున్నారు.