దళితుల అభివృద్ధికి..  టీడీపీ ప్రత్యేక కృషి


– దళిత మహిళలకు పొట్టేళ్లు గొర్రెల పంపిణీ చేసీన మంత్రి సునీత
అనంతపురం, నవంబర్‌20(జ‌నంసాక్షి) : దళితుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మంగళవారం రాప్తాడు మండలం పరిధిలోని బొమ్మపర్తి గ్రామంలో మండల వ్యాప్తంగా వెలుగు సంఘాలలో సభ్యులుగా ఉన్న దళిత మహిళల కుటుంబాలకు పొట్టేళ్లను, గొర్రెలను పంపిణీ చేశారు. ఒక్కొక్క మహిళకు రూ.25వేలు విలువ చేసే 5 పొట్టేళ్ళను, 82మంది మహిళా సభ్యులకు రూ.20 లక్షల 50 వేల రూపాయలు విలువ చేసే పొట్టేళ్లను, గొర్రెలను పంపిణీ చేశారు. గ్రావిూణాభివృద్ధి శాఖ వెలుగు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు, వాటర్‌ షెడ్‌ పథకం ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని పరిటాల పేర్కొన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా స్పెషల్‌ ప్యాకేజీని రాప్తాడు నియోజకవర్గంలో ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పిడి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ ఆకుల వెంకట్రాముడు, కన్వీనర్‌ నారాయణస్వామి, మహిళా సంఘం అధ్యక్షులు వరలక్ష్మిలు పాల్గొన్నారు.