దిగ్బంధం.. నిర్బంధం


– అట్టుడికిన రాజధాని పరిసర ప్రాంతాలు
– చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్భందం
– వేలాదిమందిగా రైతులు బైఠాయింపు
– నిలిచిపోయిన వాహనాలు.. 20కి.విూ మేర ట్రాఫిక్‌ జామ్‌
– అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
– అడ్డుకున్న రైతులు.. రైతుపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే గన్‌మెన్‌
– ఆగ్రహంతో ఎమ్మెల్యే కారుపై రాళ్లురువ్విన రైతులు
– పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో వేగంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే
– తెదేపా నేతల గృహనిర్బంధం
అమరావతి, జనవరి7(జనంసాక్షి) : రాజధాని కోసం పోరు బాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. సోమవారం భారీ పాదయాత్రతో ¬రెత్తించిన రైతులు, మహిళలు మంగళవారం చినకాకాని వద్ద జాతీయరహదారిని దిగ్బంధించారు. అమరావతి ఐకాస పిలుపుమేరకు జాతీయ రహదారిపై
బైఠాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి హాయ్‌ల్యాండ్‌, గుంటూరుకు తరలించారు. రైతులు హాయ్‌ల్యాండ్‌లో ఎండలోనే కూర్చుని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చినకాకాని వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అతి కష్టంవిూద పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులను పక్కకు లాగి మంత్రి కాన్వాయ్‌ వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. చినకాకాని చేరుకుని హైవేపై బైఠాయించిన తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి గుంటూరు తరలించారు. ఆందోళనలో పాల్గొనే రైతులకోసం సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగి రణరంగంలా మారింది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెదేపా నేతలు చినకాకాని చేరుకోకుండా ముందుగానే గృహనిర్బంధంలో ఉంచారు. కొందరు నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, సీనియర్‌ నేతలు బోడె ప్రసాద్‌, యలమంచిలి రాజేందప్రసాద్‌, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, గంజి చిరంజీవి తదితరులను గృహనిర్బంధం చేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసు అందజేశారు. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశానని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. నేనేమైనా హింసకు పాల్పడ్డానా? చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటుకు తాళ్లు కట్టడం హేయమైన చర్య అని ఖండించారు. రాజధాని రైతులకు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్దే జయదేవ్‌ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జయదేవ్‌ మాట్లాడుతూ.. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. వచ్చే నాలుగేళ్లు ఎలా ఉంటుందోనని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సీఎం చెప్పిన విధంగానే కమిటీలు నివేదికలు ఇస్తున్నాయని, సీఎం ప్రకటనకు విరుద్ధంగా కమిటీల నివేదకలు ఇచ్చే పరిస్థితి ఉండదని జయదేవ్‌ అన్నారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును, విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గృహనిర్బంధంలో ఉంచారు. తెదేపా నేతలు ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు తెదేపా మద్దతు ప్రకటించించి ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను, వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహనిర్బంధంలో ఉంచారు. చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. విజయవాడ, పెనమలూరు,
నియోజకవర్గాల్లో తెదేపా నేతలు, కార్యకర్తలను గృహనిర్బంధంలో ఉంచారు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌ నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా మంగళగిరిలో తెదేపా నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్‌ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావును గృహనిర్బంధంలో ఉంచారు. తాడేపల్లి పట్టణ, రూరల్‌ తెలుగుదేశం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణంలో జేఏసీ నాయకులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్యను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును గృహనిర్బంధంలో ఉంచారు.