దుబ్బాకలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌…

– కరోనా సమయంలో సైతం వెల్లివిరిసిన చైతన్యం.. బారులు తీరిన ఓటర్లు

– ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 82.61 శాతం నమోదు

– టిఆర్‌ఎస్‌కు 30వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం

దుబ్బాక,నవంబరు3 (జనంసాక్షి):దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మికమరణం కారణంగా ఈరోజు జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార¬రుతో నెల రోజులుగా మారుమోగిన దుబ్బాక నియోజకవర్గం అంతటా ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం స్పష్టంగా కనిపించింది. కరోనా నిబంధనలతో రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికలైనప్పటికీ ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఓటింగ్‌ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గత సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్‌ శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ ఈరోజు 82.61 శాతం నమోదైంది. ప్రచార సమయంలో టిఆర్‌ఎస్‌, బీజేపీ ల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ పోలింగ్‌ రోజు నియోజకవర్గమంతటా ప్రశాంత వాతావరణం కనిపించింది. ఈరోజు జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి ‘జనంసాక్షి’ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. టిఆర్‌ఎస్‌ 55-60, బిజేపి 30-40, కాంగ్రెస్‌ 10-20, ఇతరులు 5-10 శాతం ఓట్లు పొందే అవకాశం ఉన్నదని ‘జనంసాక్షి’ ఇంతకు ముందే ప్రకటించిన అంచనాలకు దగ్గరగా టిఆర్‌ఎస్‌ కు ముప్పై వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు జరగనున్న నవంబర్‌ పదో తేదీన అభ్యర్థుల అసలు భవితవ్యం తేలనుంది.