దుమారం లేపిన ట్రంప్‌ వ్యాఖ్యలు

– ఇమ్రాన్‌తో భేటీలో కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తాన్న ట్రంప్‌
– భారత్‌ ప్రధానికూడా తనను కోరారన్న అగ్రరాజ్య అధినేత
– ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్‌
– నష్టనివారణ చర్యలకు దిగిన అగ్రరాజ్యం
– కశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య..
– ఇరుదేశాలు చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని శ్వేతసౌదం వెల్లడి
– కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలతో లోక్‌సభలో రభస
– ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల డిమాండ్‌
– ట్రంప్‌ను మోదీ ఏవిూ అడగలేదు
– రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్‌
న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌, అగ్రరాజ్య అధినేత ట్రంప్‌ సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తానని, భారత్‌ ప్రధాని కూడా తనను మధ్యవర్తిత్వం వహించాలని కోరాడని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. కశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని.. దీనిపై ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోదలిస్తే అమెరికా స్వాగతిస్తుందని శ్వేతసౌధంలో ఆదేశ అధికార ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ తీసుకునే పటిష్ఠ చర్యల ఆధారంగానే ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హావిూ ఇచ్చారని, అంతర్జాతీయ సమాజం సైతం ఆ దేశంపై ఆంక్షలు విధించిందన్నారు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇదిలాఉంటే భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌తో భేటీ సందర్భంగా మోదీ కశ్మీర్‌ మధ్యవర్తిత్వంపై ఎలాంటి చర్చ జరపలేదని తెలిపారు. ట్రంప్‌ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమని స్పష్టం చేశారు. అలాగే అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు సైతం ట్రంప్‌ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఈ విషయంలో ట్రంప్‌ తరఫున క్షమాపణలు కోరుతున్నామనడం గమనార్హం. ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌-అమెరికా మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల విశ్లేషణల నేపథ్యంలోనే అమెరికా మెత్తబడ్డట్లు తెలుస్తోంది.
పార్లమెంట్‌లో దుమారం..
కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మంగళవారం పార్లమెంట్‌లో దుమారం రేపాయి. దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భారత్‌ దాసోహం అయ్యిందన్నారు. మనం బలహీనులం కాదు, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని అధిర్‌ డిమాండ్‌ చేశారు. అయితే జీరో అవర్‌లో దీని గురించి చర్చిద్దామని స్పీకర్‌ అన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ దీనిపై ప్రకటన చేస్తుందని పార్లమెంటరీ వ్యవహారల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. కశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్యసమితి వరకు తీసుకు వెళ్లింది ఎవరో తెలుసు అని ఆయన
పరోక్షంగా మాజీ ప్రధాని నెహ్రూపై ఆరోపణలు చేశారు. ఇది సీరియస్‌ అంశమని, ఇందులో రాజకీయాలు ఉండకూడదన్నారు. నిర్మాణాత్మకమైన చర్చ జరగాలని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ట్రంప్‌ కామెంట్‌పై చర్చ చేపట్టాలని సీపీఐ ఎంపీ డీ రాజా రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ థరూర్‌ కూడా స్పందించారు. తానేవిూ మాట్లాడుతున్నాడో ట్రంప్‌కు తెలియదని, బహుశా ఆయనకి సమస్య అర్థం కాలేదనుకుంటే, లేదా ఆయనకు సరిగా ఎవరూ చెప్పలేదనుకుంటనన్నారు. కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తి వద్దు అన్న విషయం మన విధానం అని, మధ్యవర్తి కోసం మోదీ మరొకర్ని ఆశ్రయించడం అసంభవమే అన్నారు. ఒకవేళ పాక్‌తో మాట్లాడాలని అనుకుంటే, నేరుగా మాట్లాడాలని శశిథరూర్‌ అన్నారు.
ట్రంప్‌ను మోదీ అడగలేదు – విదేశాంగ మంత్రి జైశంకర్‌
కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్‌ను మోదీ కోరలేదని సోమవారం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. పాక్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షికంగానే చర్చిస్తామని మంత్రి తెలిపారు. సీమాతంర ఉగ్రవాదం నిలిపివేస్తేనే చర్చలు సాధ్యమన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు సిమ్లా అగ్రిమెంట్‌, లా¬ర్‌ డిక్లరేషన్‌ ప్రకారమే పరిష్కారం అవుతాయన్నారు. అయితే సభ్యుల నినాదాల మధ్య సభను 12గంటలకు వాయిదా వేశారు. కశ్మీర్‌ సమస్య జాతీయ అంశమని, జాతి ఐక్యతకు సంబంధించిన అంశంపై ఒకే గొంతు వినిపించాలని చైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు.