దుర్గా మండపాలపై..  దాడులు జరిగే అవకాశముంది!


– ఉత్తర బెంగాల్‌ ప్రాంతాన్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు
– హెచ్చరించిన నిఘా వర్గాలు
కోల్‌కతా, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : దేశంలో దుర్గా నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించే ప్రాంతాల్లో పశ్చిమ్‌బంగ మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఘనంగా సంబరాలు చేసుకుంటారు. కాగా దుర్గాపూజలు నిర్వహించే మండపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు పశ్చిబ్‌బంగాకు సూచించాయి. ఉత్తర బెంగాల్‌ ప్రాంతంలో దాడులు జరిగే ప్రమాదం ఉందని తెలిపాయి.
ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి, కూచ్‌బెహర్‌, అలీపుర్‌దవార్‌, సిలిగురి ప్రాంతాలక ఉగ్రముప్పు ఉందని నిఘాసంస్థలు హెచ్చరించాయి. జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారు దుర్గాపూజ సమయంలో దాడులకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోందని, కొందరు ఉగ్రవాదులు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించి కూచ్‌బెహర్‌ జిల్లాకు చేరుకున్నారని, రెండ్రోజుల్లో మరి కొందరు ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందినట్లు వెల్లడించాయి. దుర్గాపూజ సమయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, అత్యంత అప్రమ్తంగా ఉండాలని ప్రభుత్వానికి తెలిపాయి. ఉగ్రవాదులు నేపాల్‌ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోందని చెప్పాయి. 2014 అక్టోబరులో బురుద్వాన్‌ జిల్లాలో దుర్గాపూజ ఉత్సవాల్లో బాంబు పేలింది. ఇందులో జేఎంబీ స్లీపర్‌ సెల్స్‌ పాత్ర ఉందని బయటపడింది.