దేవుడితోనైనా కలబడతాం.. రైతులవైపే నిలబడుతాం

– నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం
– అపెక్స్‌ కౌన్సిల్‌లో ధీటుగా వాదనలు వినిపించండి
– సీఎం కేసీఆర్‌ దిశనిర్దేశం
హైదరాబాద్‌,అక్టోబరు 1(జనంసాక్షి): తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాడుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల (అక్టోబర్‌) 6న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్‌ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌. ఎమ్మెల్యేలు అబ్రహం, సురేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో అధికారులు నర్సింగారావు, భూపాల్‌రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్‌కే జోషి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఈఎన్సీలు మురళీధర్‌రావు, బీ నాగేందర్‌రావు, హరిరాం, సీఈలు నర్సింహ, శంకర్‌, రమేశ్‌, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, తదితరులు పాల్గొన్నారు.