దేశంలో కల్లోల రాజకీయం నెలకొంది

– దేశంకోసం ప్రార్థించండి
– కైస్త్రవ మతబోధకులనుద్దేశించి లేఖ రాసిన ఢిల్లీ ఆర్చ్‌ బిషప్‌
– ఆర్చ్‌బిషప్‌ లేఖపై.. రాజకీయ దుమారం!
– తప్పుపట్టిన బీజేపీ
న్యూఢిల్లీ, మే22(జ‌నం సాక్షి ) : దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం నెలకొందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్‌ లేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘దేశం కోసం’  ప్రార్థించాలంటూ కైస్త్రవ మతబోధకులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని చర్చిలను ఉద్దేశించి ఈ నెల 8న ఆర్చ్‌బిషప్‌ అనిల్‌ కౌటో లేఖరాశారు. దేశం కోసం’ ప్రార్థనా ప్రచారం చేయాలని, ప్రతివారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనల సందర్భంగా తప్పకుండా లేఖలో పేర్కొన్న ప్రార్థనను చదివి వినించాలని ఆర్చ్‌బిషప్‌ అనిల్‌ కౌటో తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ కల్లోల వాతావరణాన్ని చూస్తున్నామని, ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక విలువలు, లౌకిక నిర్మాణానికి ముప్పుగా పరిణమిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో హుందాతనంతో కూడిన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, మన రాజకీయ నాయకుల్లో స్వచ్ఛమైన దేశభక్తి జ్వాల ఎగిసిపడేలా చూడాలని ప్రభువును కోరుతూ ప్రార్థన చేయాలని లేఖలో సూచించారు. అయితే, ఈ లేఖలో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ లేదని, ఎన్నికలకు ముందు ఇలా లేఖ రాయడం ఆనవాయితీగా వస్తుందని ఆర్చ్‌బిషప్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్చ్‌ బిషన్‌ రాసిన ఈ లేఖను బీజేపీ తప్పుబట్టింది. ‘కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం తప్పు. సరైన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయమని విూరు చెప్పవచ్చునని, కానీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓటు వేయకూడదని చెప్తూ విూకు విూరే కుహనా లౌకికవాదిగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం అని బీజేపీ అధికార ప్రతినిధి రెనా ఎన్సీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సమ్మిళిత అభివృద్ధి కృషి చేస్తున్నారని, ఏ ఒక్క వర్గంపైనా కేంద్రం వివక్ష చూపడం లేదని, ఈ నేపథ్యంలో అందరూ ప్రగతిశీల సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే దేశంలోని మైనారిటీలందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర ¬మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మైనారిటీలు సురక్షితంగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటనీ…కులం, మతం పేరిట వివక్ష చూపించేందుకు ఎవర్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని చర్చిలన్నిటికీ ఆర్చిబిషప్‌ అనిల్‌ జోసెఫ్‌ కౌంటో లేఖ రాయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో  సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడేలా సంవత్సరం పొడవునా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలంటూ ఆయన తన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో విూడియా అడిగిన ఓ ప్రశ్నకు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ… ‘నేను ఆ లేఖ చూడలేదు. అయితే మైనారిటీలు సురక్షితంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. కులం, మతం ఆధారంగా వివక్ష చూపించే ఎవరికీ ఇక్కడ తావులేదు..’ అని పేర్కొన్నారు.
———————————–