దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక టీఎస్ యుటిఎఫ్ భవన్ లో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతం – విద్యారంగ పరిస్థితులు అనే అంశంపై ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో నేటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్వాతంత్రానంతరం అనేక విద్యా కమిషన్లు రూపొందించినప్పటికీ వాటి అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల పేదవాడికి విద్య అందరి ద్రాక్షగా మారిందన్నారు.ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడం వలన సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయామని అన్నారు.విద్యాసంస్థల్లో బడ్జెట్ కేటాయింపులు తిరోగమన దిశలో ఉన్నాయని, బోధన బోధనేతర సిబ్బందిని కొన్ని సంవత్సరాలుగా నియమించకపోవడం వలన విద్యారంగం అభివృద్ధికి ఆటంకం కలిగిందని తెలిపారు.2020 జాతీయ విద్యా విధానం ప్రస్తుత విద్యా అవసరాలను తీర్చే విధంగా లేదని దానిని రద్దుచేసి సరియైన విద్యా విధానాన్ని రూపొందించాలన్నారు.ఈ సదస్సులో ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్  రాములు , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య ,జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య , జిల్లా కార్యదర్శులు జే .యాకయ్య , సిహెచ్ వీరారెడ్డి , వెంకన్న , పాపిరెడ్డి, రమేష్ , అనిల్ కుమార్ , క్రాంతిప్రభ , లాలు, శ్రీనివాస చారి వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.