దేశానికి ఆదర్శంగా రైతు సంక్షేమ పథకాలు

తెలంగాణ రైతాంగం దశ తిరిగిందన్న కొప్పుల
ధర్మపురి,జూన్‌10(జ‌నంసాక్షి): దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మాత్రమే రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వారికోసం అనేక పథకాలు పెడుతూ వారి అభివృద్ది లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ సరఫరాతో పాటు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పెట్టుబడి కొరకు ఎకరాకు రూ.10 వేల సహాయం, మిషన్‌ కాకతీయ ద్వారా సాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రమాద బీమా సదుపాయం ద్వారా ఐదు లక్షల నగదు మృతుడి కుటుంబానికి అందిస్తామని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు దేశంలోని ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. సంక్షేమ కార్యక్ర మాలకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పంతో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం దేశానికే ఆదర్శమని అన్నారు. ఎకరాకు రెండు పంటలకు రూ.10వేలు అందించడం ద్వారా రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్నది లక్ష్యమని చెప్పారు. రైతుల కుటుంబాలకు మరింత భరోసాగా నిలిచేందుకు రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పి స్తుందని, ప్రతిరైతుకు రూ.5 లక్షలు బీమా వర్తించేలా ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. బీమా ప్రీమియం ప్రతి సంవత్సరం ప్రభుత్వమే చెల్లించడం ద్వారా రైతులపై ఎలాంటి భారం లేకుండా ఈ పథకం అమలు చేయనుందని, ఈ పథకం సైతం ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.