దేశానికి కెసిఆర్‌ నాయకత్వం అవసరం: పల్లా

1నుంచి టిఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ దేశం మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా ఉంది. దేశంలో ఎవరూ చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేశం మొత్తం కోరుకుంటుంది. జాతీయ నాయకుల కంటే ఎక్కువగా దేశంపై అవగాహన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని పేర్కొన్నారు. కెటిసార్‌ నాయకత్వం దేశానికి అవసరమని ఆదివారం నాడిక్కడ అన్నారు. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌కు ప్రజలు ఆమోదం తెలపబోతున్నారని అన్నారు.ఇదిలావుంటే  టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. ప్రతిరోజు రెండు సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 1న కరీంనగర్‌లో మొదటి సమావేశం జరుగుతుంది. మార్చి 2న వరంగల్‌, భువనగిరి. మార్చి 3న మెదక్‌, మల్కాజ్‌గిరి. మార్చి 6న నాగర్‌కర్నూల్‌, చేవెళ్ల. మార్చి 7న జహీరాబాద్‌, సికింద్రాబాద్‌. మార్చి 8న నిజామాబాద్‌, ఆదిలాబాద్‌. మార్చి 9న పెద్దపల్లి, రామగుండం. మార్చి 10న మహబూబాబాద్‌, ఖమ్మం. మార్చి 11న నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కార్యకర్తలతో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరగనున్నాయి.