దేశానికి రాహుల్‌ క్షమాపణ చెప్పాలి 

– బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా
న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనం సాక్షి)  : రాఫెల్‌ యుద్ధ విమానాల కొలుగోలు ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించిందని బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా విమర్శించారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవిూక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరంలేదని కూడా సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. రఫేల్‌ ఒప్పందంపై అసత్య ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాహుల్‌, ఆయన పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీవ్ర ప్రయత్నాలు చేశారని, కానీ ఇప్పుడు నిజం బయటపడిందని అన్నారు. రాహుల్‌ గాంధీ ఇప్పటికైనా దేశానికి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. కాగా  కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అప్రదిష్టపాలు చేసేందుకే రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ లేనిపోని ఆరోపణలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించిందనీ… ఆ పార్టీని ప్రజలు క్షమించబోరని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని రక్షణ మంత్రి డిమాండ్‌ చేశారు.