దేశాన్ని కాపాడాలనుకుంటే..  బీజేపీకి ఓటు వేయకండి


– టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఐదేళ్ల పాలనలో మోదీ దేశాన్ని విభజించి పాలించారని, రాష్ట్రాలను కేంద్రం చెప్పుచేతల్లోకి తీసుకొనేలా ప్రయత్నించారని పశ్చిమ బెంగాళ్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని కాపాడాలనుకుంటే బీజేపీకి ఓటే వేయవద్దని ఆమె పిలుపునిచ్చారు. కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో శనివారం టీఎంసీ ఎన్నికల ప్రచార సభలో శనివారం ఆమె మాట్లాడారు.. : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని,  మోదీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో ప్రజలను మతపరంగా విభజించి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయనకు తెలిసిపోయిందని, అందుకే ఆయన ముకం మాడిపోయిందని అన్నారు. ఆయనకు ఓటమి ఫోబియా పట్టుకుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, న్యూఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో ఓటమి గురించి ఆలోచిస్తూ రోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. త్రిపురలో బీజేపీ గెలిచినా నేను పట్టించుకోనని, అక్కడ గెలిచినా ఆ పార్టీకి 543 సీట్లు రావని, అందుకే ఆయన (మోదీ) బెంగాల్‌లో తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలను హిందూ-ముస్లింలంటూ విభజిస్తూ ఓట్లు సంపాదించుకోవచ్చునన్న ఆశతో వస్తున్నారని మమత మండిపడ్డారు. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. దేశాన్ని కాపాడాలనుకుంటే బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పడిన అవస్థలను మర్చిపోయారా అని అడిగారు. కోట్లాదిమంది ఈ నిర్ణయం వల్ల బాధలు అనుభవించారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, విూరు ఆయనకు సమాధానం చెప్పరా అని అడిగారు. బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేఖంగా ఓట్లు వేసి వాళ్లకు చెంపదెబ్బ కొట్టండి అని మమత బెనర్జీ పిలుపునిచ్చారు.