దేశాభివృద్ధే లక్ష్యం – ప్రధాని మోదీ

 

వారణాసి,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):పరిపాలన అంటే రాజకీయం చేయడమో.. లేక ఎన్నికలు గెలవడమో కాదని, దేశాన్ని అభివృద్ధిపరచడమే తమ పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్న మోదీ తన నియోజకవర్గం వారణాసిలోని షహెన్‌షాపూర్‌లో ఆయన ఇవాళ పర్యటించారు. అక్కడ పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ సర్టిఫికెట్లను అందజేశారు. ఆ తర్వాత ప్రధాని ప్రజలను ఉద్దేశించిమాట్లాడుతూ.. పార్టీ కన్నా దేశమే గొప్పదని అన్నారు. స్వచ్ఛత అనేది స్వభావంగా మారాలని, అది మన అందరి బాధ్యత అని ప్రధాని అన్నారు. దేశం స్వచ్ఛంగా ఉంటే.. అది ఆరోగ్యంగా ఉన్నట్లే అని మోదీ అన్నారు. పశుధన్‌ మేళాను ఏర్పాటు చేసిన యూపీ సీఎం యోగిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. 2022లోపు దేశంలోని ప్రతి పేదకు ఇండ్లు కట్టిస్తామన్నారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకోవడంలో విఫలం అయ్యాయన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఓట్ల కోసం పనిచేయడం లేదని, దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధానమంత్రిఅన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. నేడు రైతులను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఓట్ల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా వరకు పార్టీకంటే దేశమే ముఖ్యం. ప్రభుత్వం అంటే రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం కాదు. దేశాన్ని అభివృద్ధి చేయడమే. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న దేశం మనది. అయితే పాలను ఉత్పత్తి చేసే మిగతా దేశాలతో పోలిస్తే మనది తక్కువే. అందుకే పశు సంరక్షణపై దృష్టిపెట్టాం.’ అని మోదీ అన్నారు. రానున్న ఐదేళ్లలో స్వాతంత్‌ర్య సమరయోధులు కలలుగన్న స్వరాజ్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా పథకాలు తీసుకొస్తామని.. 2022 నాటికి ‘అందరికీ ఇళ్లు’ పూర్తిచేస్తామని అన్నారు. ఇక ‘స్వచ్ఛ భారత్‌’పై కూడా మోదీ ప్రసంగించారు. ‘అపరిశుభ్ర వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరు. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత, కుటుంబ బాధ్యత. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లే అనేక రోగాలు వ్యాపిస్తాయి. ‘స్వచ్ఛ భారత్‌’ అయితేనే ‘ఆరోగ్య భారత్‌’ ఏర్పడుతుంది. స్వచ్ఛత అనేది చాలా కష్టమైన పనే అయితే మోదీనే దానికి శ్రీకారం చుట్టకపోతే ఇంకెవరు చేస్తారు.’ అని అన్నారు. స్వచ్ఛత అనేది తనకు పూజలాంటిదని, ఈ విధంగా పేదప్రజలకు సేవ చేస్తున్నా నని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనుల్లో మోదీ శ్రమ దానం చేశారు. దేశంలోని అన్ని సమస్యలకూ అభివృద్ధే పరిష్కారమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని ద్వేషిస్తున్నట్లుగా ఉండేవనీ, ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ఖజానాను నాశనం చేశాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల్ని రాజకీయ సవిూకరణాలే నడిపించాయనీ, ఫలితంగా పథకాల ప్రారంభమే కానీ, పూర్తవడం చూడలేదన్నారు. తాము ప్రాజెక్టుల్ని ప్రారంభించడం మాత్రమే కాదు, పూర్తి చేస్తున్నామ న్నారు. తమ ప్రభుత్వం పేదల సాధికారతకు కృషి చేస్తోందనీ, అభివృద్ధి కలలు పరిపూర్ణ మవడం, పేదల జీవితాలు మారడం, వారు అవకాశాల్ని అందిపుచ్చుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఏ పేద వ్యక్తీ తన చిన్నారులకు పేదరికాన్ని వారసత్వంగా అందించాలనుకోరని స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించా

లనేదే తమ సర్కారు స్వప్నమని స్పష్టం చేశారు. భారత్‌ వేగంగా పురోగతి చెందుతోందనీ, తూర్పు యూపీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మన చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచానికంతా చూపాలనీ, అప్పుడే వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం జలమార్గాల్ని అనుసంధానించాలనే కార్యక్రమాల్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరు నెలల పాలనలో అద్భుతాలు సృష్టించారని కొనియాడారు. కార్యక్రమాల్లో గవర్నర్‌ రాంనాయక్‌, సీఎం యోగిఆదిత్యనాథ్‌, కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రూ.300 కోట్లతో నిర్మించిన చేనేత, హస్తకళల విక్రయ, ప్రదర్శన కేంద్రం..దీనదయాళ్‌ హస్తకళా సంకుల్‌ను ప్రారంభించారు. చెక్క, గాజు ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గ్రావిూణ హస్తకళాకారులతో మాట్లాడి ప్రోత్సహించారు. వారణాసి, వదోదర, సూరత్‌లను అనుసంధానించే మహామన ఎక్స్‌ప్రెస్‌ రైలును వీడియోలింక్‌ ద్వారా ప్రారంభించారు. ‘భారత్‌లో తయారీ’లో భాగంగా తయారు చేసిన ఈ రైలులో అధునాత సౌకర్యాల్ని ఏర్పాటుచేశారు. సూక్ష్మరుణాల్లో పేరొందిన ఉత్కర్ష్‌ బ్యాంకు సేవల్ని ప్రారంభించారు. బ్యాంకు కార్యాలయం నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

వారణాసి వాసుల కోసం నీటిలో ప్రయాణించే జలఅంబులెన్స్‌, జలశవవాహన సేవల్నీ వీడియోలింక్‌తో ప్రారంభించారు. ‘నమామి గంగ’ కార్యక్రమంలో భాగంగా మురుగుశుద్ధి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 450 ఏళ్ల క్రితం మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌ ఓ రాత్రివేళ ఆశ్రయం పొందిన వారణాసికి సవిూపంలోని షహన్‌షాపూర్‌లో మోదీ 1800 ఎకరాల్లో నిర్వహించే మహా పశుమేళాను, కొత్త నిర్మించిన గోశాలనుప్రారంభించారు. షేర్షాసూరితో యుద్ధం అనంతరం హుమయూన్‌ గంగానది దాటివచ్చి కాలుపూర్‌ అనే గ్రామంలోని ఓ వృద్ధురాలి ఇంట్లో తలదాచుకున్నారు. తన గుడిసెలో ఆశ్రయం పొందిన అతిథి ఎవరనేదీ ఆమెకి తెలియదు. చాన్నాళ్లకి గ్రామవాసులకి తెలిసొచ్చింది. అప్పట్నుంచి షహన్‌షా హుమయూన్‌ పేరిట గ్రామానికి షహన్‌షాపూర్‌ అనే పేరు స్థిరపడిపోయింది.