దేశిని లేని లోటు పూడ్చలేనిది

నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడిన వ్యక్తి దేశిని చిన్నమల్లయ్య
సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
కరీంనగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి):  సమైక్య రాష్ట్రంలో మచ్చలేని నాయకుడిగా పనిచేసిన నాయకుడు దేశిని చినమల్లయ్య అని సిపిఐ నేతలు కొనియాడారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కనీసం కంకర రోడ్లు కూడాలేకున్నా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఇందుర్తి నియోజకవర్గంలో బీటీరోడ్లు వేయించిన గొప్ప నేత మాజీ సీపీఐ నేత దేశిని చినమల్లయ్య అని ఆయన లేని లోటు పూడ్చలేనిదని సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆయన జిల్లా ప్రతి నిధులు పైడిపల్లి రాజు, మణికంటరెడ్డిలతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయనతో సిపిఐకి ఉన్న అనుబంధాన్ని తనకు వ్యక్తిగతంగా ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బం గా రాంగోపాల్‌ మాట్లాడుతూ 5 దశాబ్దాలపాటు సిపిఐతో అనుబంధం ఉండడమేకాక బద్దంఎల్లారెడ్డి భవన్‌లోచురుకుగా వ్యవహరించి కరీంనగర్‌ జిల్లాలోనేకాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదునున్న నేతగాగుర్తింపు పొందిన వ్యక్తి అన్నారు. తెలంగాణా స్వరాష్ట్ర కాంక్షను తీర్చుకునేందుకు 2001లో సిపిఐని వదిలేసి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికి కేసీఆర్‌, ఆయన పార్టీవిధానాలు నచ్చకదూరంగా ఉంటూ వచ్చిన దేశిని చినమల్లయ్య శేషజీవితం అంతా గీతాపనివారల ఐక్యవేదికను ప్రారంభించి గీతా కార్మికులకోసం, బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాదికారంకోసం నిత్యం తహతహలాడినవ్యక్తి దేశిని చినమల్లయ్య అన్నారు. ఆతర్వా త చివరి అంకంలో తిరిగి సిపిఐలో చేరేందుకు ప్రయత్నించినా కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం సహకరించకపోవడంతో సిపిఐలో చేరలే కుండానే దుర్మరణం పాలవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన రాజకీయ అనుభవాలు ఎంతోమందికి జీవితంలో మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆనాడే హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలవడమేకాక, ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు పొందిన వ్యక్తి అన్నారు. 1978లో తొలిసారిగా ఇందుర్తినుంచి సిపిఐ పక్షాన ఎన్నికైన దేశిని చినమల్లయ్య తిరిగి 1985, 1989, 1994లలో వరుసగా గెలిచి రికార్డు సృష్టించాడన్నారు. ఆయన కులమతాలకు అతీతంగా ఆప్యాయంగా పలుకరించి ఆదరాభిమానాలు చూరగొన్నాడన్నారు. ఆయనచూపిన ఆప్యాయతను నేటి సమాజంలో లభించడం కష్టమన్నారు.తానుస్వయంగా 85నుంచి 2000 సంవత్సరం వరకు కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఆయన నుం చి ఎంతోఅనుభవాన్ని నేర్చుకున్నానన్నారు. సాంప్రదాయ కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి దేశిని చినమల్లయ్యని ఎర్ర జండాతోనే తన మరణం జరుగాలని, అంత్యక్రియలు కూడా ఎర్ర జండానీడన జరగాలని తహతహలాడినప్పటికి ఆయన కోరిక నెరవేర లేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని, అయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుబూతిని తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి బూడిద సదాశివ తదితరులు పాల్గొన్నారు.