దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు బాధ్యతల స్వీకరణ

– హాజరైన కంచి పీఠాధిపతి, పలువురు సినీప్రముఖులు
– దైవసన్నిధానంలో ధర్మవిరుద్ధంగా ఏపని చేయం – మోహన్‌బాబు
హైదరాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): ఫిలింనగర్‌ దైవసన్నిధానం ఛైర్మన్‌గా సినీ నటుడు మోహన్‌బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కంచి పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, దర్శకుడు రాఘవేంద్రరావు, సుబ్బి రామిరెడ్డి, మురళీ మోహన్‌, చాముండేశ్వరీనాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 12 మంది పాలకవర్గ సభ్యులతో స్వరూపానందేంద్రస్వామి ప్రమాణం చేయించారు. అనంతరం మోహన్‌బాబు విూడియాతో మాట్లాడారు. దేవుడి గుడికి ఛైర్మన్‌గా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదని తెలిపారు. ఆరు నెలలుగా సుబ్బిరామిరెడ్డి పట్టుబట్టడంతోనే దైవసన్నిధానం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని స్పష్టం చేశారు. భక్తుల కోసమే బాధ్యత తీసుకున్నానని చెప్పారు. చిరంజీవి తాను చిలుకా గోరింకల్లా గొడవపడుతుంటామని మోహన్‌బాబు పేర్కొన్నారు. కృష్ణంరాజుతో సరదాగా ఉంటానని తెలిపారు. దైవసన్నిధానంలో ధర్మవిరుద్ధంగా ఏ పని చేయమన్న ఆయన.. బ్రాహ్మణుల మధ్య గొడవలొద్దు అని మోహన్‌ బాబు సూచించారు. అనంతరం ఈ సందర్భంగా మరో నటుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ  దైవసన్నిధానం 18దేవుళ్ల సముదాయం అని చెప్పారు. ఈ దైవసన్నిధానానికి ఆద్యుడు వి.బి. రాజేందప్రసాద్‌ అని, అప్పటి మూలధనంతో సన్నిధానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సన్నిధానానికి రూ.3 కోట్ల 70లక్షల విరాళాలు వచ్చాయని వివరించారు. ఈ దైవభక్తిలో పాలుపంచుకుంటానని మోహన్‌బాబు కోరారన్నారు. నూతన పాలకవర్గాన్ని ఎన్నుకుంటామని అన్నారు. ఇప్పటికి రెండు కమిటీలు సన్నిధానాన్ని దిగ్విజయంగా నిర్వహించాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మోహన్‌బాబు చైర్మన్‌గా రావడం ఆనందంగా ఉందని, ఆయనకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని అన్నారు.